దర్వాజ-న్యూఢిల్లీ
Indian team-World Cup 2023: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఎంపిక కమిటీ 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నారు.
వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ 2023 కోసం జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ టోర్నమెంట్ కోసం సెలక్టర్లు ఏడుగురు బ్యాట్స్ మెన్, నలుగురు ఆల్ రౌండర్లను ఎంపిక చేయడంతో 15 మంది సభ్యుల భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కు చోటు దక్కింది.
తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ నెలల తరబడి ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్ లో పాల్గొంటున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ ఆడలేదు. ఆసియా కప్ కు ముందు అతను ఎదుర్కొన్న గాయం కారణంగా అతని పునరాగమనం ఆలస్యమైంది. “మాకు కొన్ని ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి, కానీ ముగ్గురు ఆటగాళ్లు తిరిగి వచ్చారు, కెఎల్ బాగా కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచకప్ కు ఈ జట్టు అత్యుత్తమ సమతూకాన్ని ఇస్తుందని భావిస్తున్నాం’ అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.
ప్రపంచ కప్ భారత జట్టుకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆసియా కప్ జట్టులో ఉన్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఎడమచేతి వాటం ఆటగాడు తిలక్ వర్మలకు చోటు దక్కలేదు. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తో ఐసీసీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
2023 ప్రపంచకప్ కోసం భారత జట్టు:
- రోహిత్ (కెప్టెన్)
- విరాట్ కోహ్లీ
- జస్ప్రీత్ బుమ్రా
- హార్దిక్ పాండ్య
- శుభ్ మన్ గిల్
- శ్రేయాస్ అయ్యర్
- కేఎల్ రాహుల్
- రవీంద్ర జడేజా
- మహ్మద్ సిరాజ్
- మహ్మద్ షమీ
- కుల్దీప్ యాదవ్
- శార్దూల్ ఠాకూర్
- అక్షర్ పటేల్
- ఇషాన్ కిషన్
- సూర్యకుమార్ యాదవ్