Loading Now
Telangana Assembly Elections 2023, BRS, KCR,

ధరణి పోతే రైతులపై రాబంధులు పడుతారు.. : కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

ద‌ర్వాజ‌-భువనగిరి

KCR fire on Congress: ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌సంగిస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. భువనగిరి ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిలో నేడు చాలా అద్భుతమైన పంటలు పండుతున్నాయ‌న్నారు. గోదావరి జలాలు, ఇక్కడున్న రెండు మూడు కాలువలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసామ‌నీ, ఎన్నో కలలు కన్నామ‌ని చెప్పిన కేసీఆర్.. కాలువల పనులు జరుగుతున్నాయ‌నీ, త్వరలో పూర్తవుతాయ‌ని చెప్పారు.

ఈ జిల్లాకు లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతోని యాదాద్రి భువనగిరి జిల్లా అని భగవంతుని పేరు పెట్టుకున్నామ‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే భువనగిరి జిల్లానే కాకపోతుండెన‌నీ, మళ్లీ శేఖర్ రెడ్డిని గెలిపిస్తారు కాబట్టి.. 98 శాతం పూర్తయిన బసవాపూర్ రిజర్వాయర్.. నృసింహ సాగర్ ను ప్రారంభించుకుని లక్ష ఎకరాలకు సాగునీరును అందిస్తామ‌ని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులను పెంచిపోషించిందనీ, ప్రజలకు గోస పుచ్చుకున్న అలాంటి అరాచక, కిరాతక మూకలను అరికట్టి, భువనగిరి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేశామ‌ని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దని పేర్కొన్న సీఎం.. వాస్తవ పరిస్థితులను గ్రహించి, ఆలోచించి ఓటెయ్యాలని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

“మన ప్రగతికి, మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వెయ్యాలి. ఒక ఉద్వేగంతో కొట్టుకెళ్లి ఓటు వేస్తే మన జీవితాలు తలకిందులయ్యే అవకాశం ఉంటది. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్ ను తెచ్చాం. తరతరాల నుంచి వచ్చిన భూములను ఎన్నో కష్టాలుపడి కాపాడుకుంటరు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రతి ఒక్కరికీ భూములపై అధికారం ఉండేది. భూముల రిజిస్ట్రేషన్లకు కూడా ఎన్నో పాట్లు పడేది. ఇవ్వాల రిజిస్ట్రేషన్లు ఏ మండలానికి ఆ మండలంలో జరిగిపోతా వున్నది. ఒకరి భూములు ఇంకొకరికి వెళ్లే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్లు మండలాల్లోనే జరుగుతున్నాయని” చెప్పారు.

కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ.. “కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామంటున్నదనీ, ఒకసారి ధరణి అంటూ పోతే మన భూములపై అధికారం పోతది..అధికారులు వస్తరు..ఒకరి భూమి ఒకరి పేరు మీద వస్తది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటది. నీ భూమిని మార్చే హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చే అధికారాన్ని ప్రభుత్వం నీకు కల్పించింది. మీ భూమి మారాలంటే మీ బొటనవేలు ముద్ర పడితే తప్ప ఏ ముఖ్యమంత్రికి కూడా మార్చే అధికారం లేదు ఈ రాష్ట్రంలో. గవర్నమెంటు తన అధికారాన్ని తీసి మీకప్పగించింది. దాన్ని ఉంచుకోవాల్నా లేదా పోడగొట్టుకోవాల్నా ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాన‌ని” చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులని మళ్లీ రాగాలు తీస్తున్నార‌ని విమ‌ర్శించిన కేసీఆర్.. ధరణి పోర్టల్ పోతే రైతులపై రాబంధులు పడుతారనీ, పొరపాటున మళ్లీ కాంగ్రెస్సే వస్తే.. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ‌ని పేర్కొన్నారు. రైతులను పైరవీకారుల పాలు చేసిన కాంగ్రెస్ రాజ్యం మల్ల రావాల్నా.. మల్ల అదే పాట పాడాల్నా.. పాత బాధ కలుగాల్నా.. దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాన‌ని” చెప్పారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా మల్ల కాంగ్రెస్ దెబ్బ పడుతదనీ, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందనీ, దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చ‌రించారు.

Share this content:

You May Have Missed