దర్వాజ-న్యూఢిల్లీ
Indian Army vacancies: ఇండియన్ ఆర్మీలో ఏడువేలకు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్ భట్ తెలిపారు. జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ రామ్ నాథ్ ఠాకూర్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఉద్యోగ ఖాళీల గురించి ప్రశ్నించగా, మంత్రి దీనికి సమాధానమిస్తూ.. 2021లో 1,512 ఆఫీసర్ పోస్టులను, 2022లో 1,285 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.
గతేడాది నుంచి సైన్యంలో ఏడు వేలకు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అజయ్ భట్ తెలిపారు. ఇది 2022 జనవరి 1 న 7,665 ఉండగా, 2022 డిసెంబర్ 15 నాటికి 7,363 కు చేరుకుందన్నారు. డిసెంబర్ 15 నాటికి మిలటరీ నర్సింగ్ ఆఫీసర్ల విభాగంలో 511 ఖాళీలు ఉండగా, జనవరి 1 నాటికి 471 చేరుకున్నాయి. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు/ఇతర ఆఫీసర్ల పోస్టుల ఖాళీలు డిసెంబర్ 15 నాటికి 1,18,485గా ఉన్నాయి. అయితే, ఈ ఏడాది జనవరి 1 నాటికి 1,08,685కు పెరిగాయని మంత్రి తెలిపారు.
ఇండియన్ నేవీలో ఆఫీసర్ల ఖాళీలు (మెడికల్, డెంటల్ మినహా) 2021 డిసెంబర్ 31న 1,557 నుంచి 1,653కు చేరుకున్నాయి. నావికుల ఖాళీలు 2021 చివరి రోజున 11,709గా ఉన్నాయి. అయితే, గతేడాది ఇదే సమయానికి 10,746కు తగ్గాయని తెలిపారు. ఇక వైమానిక దళంలో అధికారుల ఖాళీలు (మెడికల్, డెంటల్ మినహా) 1 జనవరి 2022 న 572 నుండి 1 డిసెంబర్ 2022 నాటికి 761 కు పెరిగాయని మంత్రి అజయ్ భట్ తెలిపారు.