దర్వాజ-భోపాల్
Man Arrested For Allegedly Forcing Wife To Drink Urine: భార్యకు బలవంతంగా మూత్రం తాగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తన భర్త తనను కొట్టాడనీ, బలవంతంగా మూత్రం తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. తన భర్త తనకు బలవంతంగా మూత్రం తాగించాడనీ, శారీరకంగా దాడి చేశాడని మధ్యప్రదేశ్ లోని సెహోర్లో ఓ మహిళ ఆరోపించింది. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని రాష్ట్రంలో అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
“అతను నన్ను కొట్టాడు.. మూత్రం తాగించాడు. నాకు న్యాయం కావాలి. గతంలో ఎన్నో బాధలు పడ్డాను కానీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఒకసారి కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఈ రోజు వరకు ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ ఘటన నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది” అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన పిటిషన్ ను ఎవరూ వినకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం కోరతానని చెప్పారు.
అయితే, తన భర్త తనపై దాడి చేశాడని, ఆ ఘటనను వీడియో తీశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి పూజా రాజ్ పుత్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.