- భారత్ లో ఒకే రోజు 2.17 లక్షల పాజిటివ్ కేసులు
- దేశంలో కొత్తగా 1,185 మరణాలు
- కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో టాప్-5లో అమెరికా, భారత్, బ్రెజిట్, రష్యా, ఫ్రాన్స్
దర్వాజ-న్యూఢిల్లీ
భారత్‌లో కరోనా రక్కసి రంకెలేస్తోంది. రోజురోజకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఆకాశమే హద్దుగా వ్యాపిస్తోంది. నిత్యం రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,17,353 మందికి కరోనా సోకింది.
ఒక్కరోజులోనే దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఇదే సమయంలో 1,185 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 మరణాలు 1,74,308కి, పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,25,47,866 మంది కోలుకున్నారు.
భారత్‌లో యాక్టివ్ కేసులు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్, కరోనా నిర్థారణ పరీక్షలు ముమ్మరం చేశారు. మొత్తం 11,72,23,509 మందికి నేటి వరకు వ్యాక్సిన్లు వేశారు. కాగా, గురువారం కొత్తగా 14,73,210 శాంపిళ్లను పరీక్షించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 26,34,76,625కు పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా 2,999,996 కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. వరల్డో మీటర్ కరోనా గణాంకాల ప్రకారం.. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 139,710,705 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ తో పోరాడుతూ 2,999,996 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారత్ లోనే అధికంగా ఉన్నాయి. అమెరికా, భారత్ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, యూకే, టర్కీ, ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాలు ఉన్నాయి.
