Breaking
Tue. Nov 18th, 2025

ఢిల్లీ కారు పేలుడు: 13 మంది మృతి, ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Photo Credits: X/Sage1709
Photo Credits: X/Sage1709

దర్వాజ – ఢిల్లీ

Delhi Car Blast :  దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట గేట్‌–1 సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న కారులో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సాయంత్రం 6:52 గంటలకు నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సాక్షుల ప్రకారం, కారు సిగ్నల్ వద్ద ఆగగానే బాంబ్ పేలడంతో పరిసర ప్రాంతమంతా వణికిపోయింది. పేలుడుతో సమీపంలోని మూడు వాహనాలకు మంటలు అంటుకుని భారీ నష్టం వాటిల్లింది.

హోం మంత్రి అమిత్ షా పరిశీలన

ఘటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. మొదట ఆయన ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

షా మాట్లాడుతూ, “ఈ దాడికి కారణం ఏదైనా కావచ్చు. కానీ నిందితులను తప్పించుకోనివ్వం. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది” అని స్పష్టం చేశారు.

ఇద్దరు అనుమానితుల అరెస్ట్

ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు. వారిని విచారిస్తున్నామని, పేలుడు ఉద్దేశపూర్వకమా లేక ప్రమాదవశాత్తా జరిగిందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, వాహనాల రికార్డులు, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ఘటన అనంతరం ఢిల్లీ నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను మరింత బలపరిచారు. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఐబీ, ఫోరెన్సిక్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాని మోదీ సంతాపం, భద్రతా సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ పేలుడు ఘటనపై సంతాపం ప్రకటించారు. ఆయన ఎక్స్ (X) వేదికలో స్పందిస్తూ, “పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించాను” అని పేర్కొన్నారు.

Related Post