ఆ వ్యక్తికి కరోనా సోకింది. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలనుకున్నాడు. మధ్యలో రంగంలోకి దిగిన పోలీసులు మానవత్వాన్ని, తమ వృత్తి ధర్మాన్ని మరిచి క్రూరంగా ప్రవర్తించారు. ఇది మధ్యప్రదేశ్ పోలీసుల దాష్టీకం. ఇదివరకే ఇలా దారుణంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచి మధ్యప్రదేశ్ పోలీసులు మరో సారి వారి దాష్టీకం బయటపడింది. కరోనా రోగిని చితకబాదారు . లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న కుటుంబసభ్యులను సైతం గొడ్డును బాదినట్టు బాదారు.
అమానుషమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో చోటుచేసుకుంది. పోలీసులు దాడిలో కరోనా పేషంట్‌తో సహా కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. బంజరి గ్రామానికి చెందిన యువకుడికి ఇటీవలే కరోనా సోకింది. ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ యువకుడికి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రాగా, తాను ఆశా కార్యకర్తననీ, తన కుమారుడు ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకుంటాడని ఆ యువకుడి తల్లి ఆరోగ్యశాఖ సిబ్బందితో చెప్పింది. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలోనే కరోనా పేషంట్ కుటుంబసభ్యులపై ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బంజరి గ్రామానికి చేరుకున్న పోలీసులు.. కరోనా పేషంట్‌తో సహా కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.