- బాధిత మైనర్ ను పెండ్లి చేసుకుంటావా? సాయం చేస్తాం… : సుప్రీం కోర్టు
- నిందితుడికి ఇదివరకే పెండ్లి అయింది.
- నాలుగు వారాల పాటు ఆరెస్టు నుంచి మినహాయింపు.
దర్వాజ-న్యూఢిల్లీ: ఓ మైనర్ పై లైంగికదాడికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగికి ‘‘ ఒకవేళ బాధితురాలిని పెండ్లి చేసుకుంటే సాయం చేస్తాం.. ’’ అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన.. ఊహించని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకెళ్తే.. ఓ మైనర్ పై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీ టెక్నీషియన్ మోహిత్ సుభాష్ చవాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో సదరు నిందితుడు బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేతో కూడిన ధర్మాసనం బాధితురాలిని పెండ్లి చేసుకుంటే మేం సహాయం చేస్తామంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఒకవేళ బాధితురాలిని పెండ్లి చేసుకుంటే సాయం చేస్తాం.. కాదంటే ఉద్యోగం పోగొట్టుకుని జైలుకు వెళ్తావు… బాలికను ఆకర్షించి లైంగికదాడికి పాల్పడ్డావు’’ అని నిందితుడి తరఫున హాజరైన లాయర్‌తో ధర్మాసనం పేర్కొంది.
అలాగే, ‘‘పెండ్లి చేసుకోమని మేం బలవంతం చేయడంలేదు… మీకు ఇష్టమైతే మాకు తెలియజేయండి… లేకపోతే ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేస్తున్నామని మీరు చెబుతారు’ అని పేర్కొంది. ‘‘యువతిని లొంగదీసుకునీ, లైంగికదాడి చేసే ముందు మీరు ఆలోచించి ఉండాలి.. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని మీకు తెలుసు’ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘‘లైంగికదాడికి గురైన బాలికను.. నిందితుడు మొదట పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ బాధితురాలు నిరాకరించింది. ప్రస్తుతం తనకు పెండ్లి జరిగిందనీ, ఇప్పుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోలేను. అరెస్టుకు గురైతే ఉద్యోగం పోతుంది’’ అని నిందితుడు కోర్టుకు తెలిపాడు. దీంతో మరో నాలుగు వారాల పాటు అరెస్టును నిలిపివేస్తున్నామని న్యాయస్థానం నిందితుడికి ఊరట కల్పిస్తూ.. సాధారణ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కాగా, న్యాయస్థానం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మరీ ముఖ్యంగా లైంగికదాడి కేసుల పరిష్కారానిని భారతీయ కోర్టులు మ్యారేజ్ లను తగిన పరిష్కారంగా అంగీకరించడంపై న్యాయ నిపుణులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
వంటింట్లో సెగ పుట్టిస్తున్న వంటగ్యాస్ !