దర్వాజ-పనాజీ
Netherlands tourist stabbed at Goa resort: గోవాలో నేదర్లాండ్స్ కు చెందిన ఒక మహిళా పర్యాటకురాలిపై కత్తితో దాడి జరిగింది. ఆమెను వేధింపులకు గురి చేశారనీ, తనతో పాటు కాపాడటానికి వచ్చిన ఒక స్థానిక వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదు లో పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. గోవాలోని పెర్నెమ్ పట్టణంలో నెదర్లాండ్స్ కు చెందిన ఒక మహిళా పర్యాటకురాలిపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన ఓ హోటల్ లో బార్ టెండర్ గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డెహ్రాడూన్ కు చెందిన అభిషేక్ వర్మ (27)గా గుర్తించారు. మాండ్రేమ్లోని విగ్వామ్ రిసార్ట్ లో బుధవారం మధ్య అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్ గోవా) నితిన్ వల్సన్ తెలిపారు.
హోటల్ ఆవరణలోని గుడారంలోకి 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడనీ, తనను వేధింపులకు గురిచేయడానికి ప్రయత్నించగా, తాను సాయం కోసం అరవడంతో స్థానికులు కాపాడారని తెలిపింది. అయితే, ఆ దుండగుడు మళ్లీ కత్తితో వచ్చి తనపై దాడి చేశాడనీ, ఈ క్రమంలోనే ఒక స్థానిక వ్యక్తిని సైతం గాయపర్చారని పోలీసులు తెలిపారు.
అయితే, ఇటీవల హోలీ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జపాన్ మహిళను కొందరు వ్యక్తులు వేధించిన నేపథ్యంలో భారతదేశంలో మహిళా పర్యాటకుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమంలో ఈ దాడి జరగడం మరోసారి మహిళా పర్యాటకుల భద్రత చర్చనీయాంశంగా మారింది.