దర్వాజ-న్యూఢిల్లీ
New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువకుడు తన ప్రియురాలి భర్త గొంతు కోసి, మృతదేహానికి నిప్పంటించాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ప్రియుడి భర్తను చంపి, అతని శవానికి నిప్పంటించిన 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వజీరాబాద్ నివాసి మునిషీద్ధీన్ గా గుర్తించారు. మృతుడి భార్యతో మునిషీద్ధీన్ ఎఫైర్ (వివాహేతర సంబంధం) పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.
వజీరాబాద్ లోని రామ్ ఘాట్ ముందు కాలిపోయిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతదేహంలో 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయని వారు తెలిపారు. విచారణలో పోలీసులు సంఘటనా స్థలానికి సమీపంలో పొదల్లో రక్తం పడివుండటం కనుగొన్నారు. ఘటనా స్థలం నుంచి ఒక పేపర్ కట్టర్, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వజీరాబాద్ నివాసి రషీద్ గా గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. మృతుడితో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ తర్వాత పోలీసులు మునిషీద్ధీన్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. రషీద్, మునిషీద్ధీన్ ఇద్దరు స్నేహితులనీ, రామ్‌ఘాట్ ప్రాంతంలో ఉంటూ.. ప్లంబర్ పనులతో పాటు ఎలక్ట్రీషియన్ పనులు చేసుకునే వారని తెలిపారు.