దర్వాజ-హైదరాబాద్
Telangana Cold waves:తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు చలిగాలులు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు వీస్తుండడంతోపాటు పలు జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతుండడంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయనీ, వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తెలంగాణలో ఈసారి చలికాలం కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ పలు ప్రాంతాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తక్కువగా 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. హన్మకొండతో పాటు మెదక్, రామగుండంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్, భద్రాచలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే అధికంగగా 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ఉదయం వేళల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు.