దర్వాజ-న్యూఢిల్లీ
Opposition meeting: 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత సోనియా గాంధీ విపక్షాల సమావేశానికి పిలుపునిస్తారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు సాగాలనే విషయాలపై చర్చిస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారని ఆర్జేడీ అధినేత తెలిపారు.
కేంద్రంలో అధికారం పీఠం నుంచి బీజేపీని తొలగించి దేశాన్ని రక్షించాలని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అందుకే మనం (ప్రతిపక్షాలు) కలిసి రావాలి ఆయన పిలుపునిచ్చారు. అలాగే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం పిలుపునిచ్చారు. గత నెలలో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన తర్వాత సోనియా గాంధీతో నితీశ్‌కుమార్ సమావేశం కావడం ఇదే తొలిసారి. “మేమిద్దరం సోనియా గాంధీతో చర్చలు జరిపాము. మనం కలిసి ఐక్యంగా ఉండి దేశ ప్రగతికి పాటుపడాలి. వారికి తమ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.. ఆ తర్వాత ఆమె (సోనియా గాంధీ) మాట్లాడుతుంది” అని బీహార్ సిఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ చీఫ్‌తో సమావేశమైన తర్వాత చెప్పారు.