Breaking
Tue. Nov 18th, 2025

Parliament: ఐదేండ్లలో 370 మిలియన్ డాలర్ల జుట్టు ఎగుమతి.. ఎంపీ విజ‌య‌సారి రెడ్డి ప్ర‌శ్న‌కు మంత్రి జ‌వాబు

Anupriya Patel

దర్వాజ-న్యూఢిల్లీ

Rajya Sabha Member V. Vijaysai Reddy: భారతదేశం నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22 లో 149.07 డాలర్లు, 2022-23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు తెలిపారు.

మానవ జుట్టు, జుట్టు ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జుట్టు (ముడి సరుకు) లభించేది భారతదేశంలోనే అని అన్నారు. అలాగే భారత్ లో లభించే జుట్టు అత్యంత నాణ్యమైనదిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరయ్యేందుకు సంబంధిత పరిశ్రమలతో కలిసి ప్లెక్స్ కౌన్సిల్ చురుకుగా పనిచేస్తోందని, జుట్టుతో విగ్గులు వంటి విలువైన వస్తువులు ఉత్పత్తి చేసేందుకు ఎగుమతిదారులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

ఇటీవల ప్లెక్స్ కౌన్సిల్ నిర్వహించిన అతిపెద్ద బ్యూటీ షో “కాస్మోప్రోఫ్ వరల్డ్‌వైడ్ బోలోగ్నా 2023″లో ఇండియా నుంచి జుట్టు ఉత్పాదనలు చేసే పరిశ్రమలకు చెందిన 20 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన  ప్రపంచదేశాల కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన లభించిందని అన్నారు. 2024లో నిర్వహించనున్న ప్రదర్శనలో ప్లెక్స్ కౌన్సిల్ ఇదే స్ఫూర్తితో పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మయన్మార్ ద్వారా చైనాకు భారతీయ జుట్టు అక్రమ రవాణా జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కస్టమ్స్ శాఖ వద్జ ఎటువంటి కేసులూ నమోదు కాలేదని మంత్రి అన్నారు.

Related Post