దర్వాజ – పాలమూరు
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో తన ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేశారు. జటప్రోలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పాలనలో ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి మూడేళ్లలో పూర్తి చేసిన కేసీఆర్, పాలమూరును పక్కన పెట్టారని విమర్శించారు.
పాలమూరు ప్రాజెక్టు సహా దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రద్దుకు సహకరించాలని కోరారు. సహకారం లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.
“ఈ పాలమూరు బిడ్డే తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాడు. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటాను,” అంటూ కేసీఆర్‌కు సవాలు విసిరారు. అలాగే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేర్చుకోవాలని సూచించారు.
జటప్రోలులో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కొల్లాపూర్ అభివృద్ధికి కావాల్సిన నిధులను పూర్తిగా ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు.పాలమూరు ప్రాంత అభివృద్ధిపై తన ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా తెలిపిన రేవంత్, డిసెంబర్ నాటికి భూసేకరణ పూర్తి చేసి కృష్ణా నీటిని పొలాలకు తీసుకొస్తామని తెలిపారు.
“మా పొలాల్లో నీళ్లు పారుతుంటే, కొందరికి కడుపుమంట వస్తోంది. కేసీఆర్ లాంటి వాళ్లు విషం చిమ్ముతున్నారు,” అని వ్యాఖ్యానించారు.రైతులకు ఇప్పటికే రూ.21 వేల కోట్ల రుణమాఫీ అందించామని, 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులుగా విడుదల చేశామని చెప్పారు. ఉచితంగా 24 గంటల కరెంటు అందిస్తున్నామని కూడా రేవంత్ వివరించారు.మహిళల సాధికారత కోసం రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పెట్రోల్ బంకులు, సోలార్ కాంట్రాక్టులు మహిళలకు అప్పగించడం జరిగిందని తెలిపారు.
“కేసీఆర్ తన కొడుక్కి బంగ్లా కట్టించాడు, మేం లక్షల మంది ఆడబిడ్డలకు కోటీశ్వర భవిష్యత్తు ఇస్తున్నాం,” అని అన్నారు.దళితులు, ఆదివాసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ముందుందని, మాదిగ వర్గీకరణతో అణగారిన కులాలకు సమాన హక్కులు కల్పించామని తెలిపారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న హామీ కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు.2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. పాలమూరు పచ్చగా మారడం ద్వారా రైతులకు నూతన జీవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పూర్తి ద్వారా పాలమూరుకు కొత్త ఊపిరి ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
