దర్వాజ-బెంగళూరు
Former Karnataka cm and senior BJP leader BS Yediyurappa: శివమొగ్గ జిల్లాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇంటి పలువురు ఆందోళనకారులు దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీలకు అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో భాగంగా జిల్లాలోని షికారిపుర పట్టణంలోని బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిని లక్ష్యంగా చేసుకుని బంజారా సామాజిక వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులకు గాయలైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే పట్టణంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.
మహిళలతో సహా పెద్ద సంఖ్యలో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలను ఉపయోగించారు. దీంతో నిరసనకు దిగిన బంజారా సామాజిక వర్గానికి చెందిన వారు గాయపడ్డారు. యడియూరప్ప ఇంటి వద్దకు వచ్చిన ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన అదనపు బలగాలను రంగంలోకి దింపి లాఠీ ప్రయోగం చేశారు.
బంజారా సామాజిక వర్గానికి చెందిన షెడ్యూల్డ్ కులాలకు తక్కువ రిజర్వేషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎస్సీల్లో అంతర్గత రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కర్ణాటక కేబినెట్ గత వారం నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి పెంచిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం.. ఎస్సీ లెఫ్ట్ సబ్ కేటగిరీకి 6 శాతం, ఎస్సీ కుడి వర్గానికి 5.5 శాతం, టచ్ బుల్స్ కు 4.5 శాతం, ఇతరులకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.