Sheikh Hasina : బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా మానవత్వ విరుద్ధ చర్యలు, ఆందోళనకారులపై బలప్రయోగం చేసిన కేసుల్లో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఆమెను దోషిగా నిర్ధారించింది. గత సంవత్సరం జూలై, ఆగస్టు మధ్య జరిగిన నిరసనల్లో సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయారని కోర్టు వెల్లడించింది. ఈ ఘటనల్లో హింసను అణచివేయడానికి హెలికాప్టర్లు, భారీ ఆయుధాలు వినియోగించాలనే ఆదేశాలు హసీనా ఇచ్చినట్లు తీర్పులో పేర్కొంది. గాయపడిన వారికి వైద్యం అందించకుండా అడ్డుకోవడం, అధికారంలో నిలవడానికి వ్యవస్థీకృతంగా బలప్రయోగం చేయడం వంటి అంశాలు కోర్టు దృష్టికి వచ్చాయి.
ఢాకాలో హై అలర్ట్ షూట్ ఎట్ సైట్ ఆదేశాలు
తీర్పు వెలువడిన వెంటనే ఢాకా సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను తగలబెట్టే ప్రయత్నం చేసే వారిపై షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేసినట్లు ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహ్మద్ సజ్జాద్ అలీ ప్రకటించారు.
ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన తర్వాత హసీనా భారత్‌లో ఓ రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. తీర్పు రానున్న వేళ ఆమె ఆడియో సందేశం విడుదల చేసి అవామీ లీగ్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ‘‘ఎలాంటి తీర్పు వచ్చినా నేను భయపడను. నా జీవితంపై నిర్ణయం దేవుడిదే’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
విచారణలో బయటపడ్డ అంశాలు మరణశిక్ష అవకాశంపై చర్చ
ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు హసీనాపై తీవ్ర నేరారోపణలకు దారితీశాయి. విద్యార్థుల నిరసనలను తీవ్రమైన చర్యలు అని అభివర్ణించి, వారిని అణచివేయాలని అధికారులు, అనుచరులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారుల మృతదేహాలను కాల్చివేయాలని సూచించిన అంశాలు కూడా రికార్డులో ఉన్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
ఈ కేసులో హసీనా గరిష్ట శిక్ష ఎదుర్కొనాల్సి ఉండొచ్చని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తీర్పు నేపథ్యంలో అవామీ లీగ్ వర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది. హసీనా కుమారుడూ ‘‘మా అమ్మకు మరణశిక్ష విధించవచ్చు అనిపిస్తోంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
