ఎన్నికల ముందు కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ లోకి 35 మంది బీఆర్ఎస్ లీడర్లు !

Congress, BRS, KCR

దర్వాజ-హైదరాబాద్

35 Leaders Of KCR’s Party To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు షాక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని బృందం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసింది. కాంగ్రెస్ చేరిక గురించి చర్చలు జరిపింది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు చెందిన 35 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసింది. ఈ కార్యక్రమంలో అధికార బీఆర్ఎస్ నుంచి మరికొంత మంది, బీజేపీ నుంచి కొందరు నేతలు పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తమ మద్దతుదారులతో కలిసి జూలై మొదటి వారంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో జాతీయ నేతల సమక్షంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రను ముగించనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను ఏప్రిల్ లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇద్దరూ కాంగ్రెస్ ను ఎంచుకోవడానికి వారి వారి స్వంత రాజకీయ కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి, పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కు మనోధైర్యం పెరిగింది. రెండు, సంప్రదాయంగా కాంగ్రెస్, వామపక్షాలు, చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఖమ్మంలో బీజేపీ బలంగా లేదు. దీంతో బీఆర్ఎస్ ను విడిచే ఖమ్మం నేతల ముందు కాంగ్రెస్ కనిపించడం కూడా కారణంగా వుండవచ్చు.

గత ఏడాది నవంబరులో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్, వామపక్షాలు కలిసి రావడంతో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. జూపల్లి కృష్ణారావు కొల్లూరు నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మహబూబ్ నగర్ నుండి మాజీ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి డీకే అరుణ రాష్ట్ర బీజేపీలో ఎదుగుతున్న స్టార్. కాబట్టి బీజేపీలోకి వెళ్లడం ఆప్షన్ కాదని కూడా ఆయన భావించివుండవచ్చు. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. 2014లో వైసీపీ ఎంపీగా గెలవడంతో పాటు ఆ పార్టీకి మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా రావడానికి దోహదపడ్డారు. కాగా, ఇప్పుడు పార్టీని వీడుతున్న నేతల వల్ల బీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తుందనీ, ఇతర ప్రాంతాల్లోనూ ప్రభావం పడవచ్చునని రాజాకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది చివరికల్లా జరిగే ఎన్నికల్లో మూడోసారి సీఎం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.. !

Related Post