దర్వాజ-న్యూఢిల్లీ
Sidhu Moose Wala: పంజాబీ ర్యాపర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూస్ వాలాను ఆదివారం నాడు మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సిద్ధూ మూస్ వాలా హత్య నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హత్యకు కారణం ఆప్ అని ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా..కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సిద్ధూ మూస్ వాలా హత్యకు బాధ్యత వహిస్తూ.. ఫేస్‌బుక్ లో ఓ పోస్టు చేశాడు.
సిద్ధూ మూస్ వాలా హత్యకు సంబంధించి టాప్-10 అంశాలు ఇలా ఉన్నాయి..
1. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూస్ వాలాను ఆదివారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
2. సిద్ధూ మూస్ వాలా కు బుల్లెట్ ఫ్రూప్ వాహనం కూడా ఉంది. అయితే, ఈ ఘటన జరిగిన రోజు ఆయన దానిని వినియోగించలేదని పోలీసులు తెలిపారు.
3. సిద్ధూ మూస్ వాలా హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు CCTV ఫుటేజీ తీసుకున్నారు. ఆ దృశ్యాల్లో తెల్లటి బొలెరో సిద్ధూ SUVకి టైలింగ్ చేయడాన్ని చూపించింది. అయినప్పటికీ రెండు ఇతర వాహనాలు అతనిని ముందు నుండి అడ్డగించాయి. ఆ తర్వాత క్షణాల్లో సిద్ధూపై కాల్పులు జరిగాయి.
4. సిద్ధూ మూస్ వాలా హత్యలో AN-94 రష్యన్ అసాల్ట్ రైఫిల్ ఉపయోగించబడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మూడు వేర్వేరు రైఫిళ్ల నుంచి 30కి పైగా బుల్లెట్లు పేలినట్లు పోలీసులు తెలిపారు.
5. సిద్ధూ మూస్ వాలా హత్యకు బాధ్యత వహిస్తూ.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు అయిన గోల్డీ బ్రార్ లు ఫేస్‌బుక్ లో పోస్టు చేశాడు. ఇక తీహార్ జైలు నంబర్ 8లో ఉన్న గోల్డీ బ్రార్ సన్నిహితుడు లారెన్స్ బిష్ణోయ్‌ని రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో పంజాబ్ పోలీసులు ఉన్నారు. కాల్పులకు సంబంధించి అతడిని విచారించనున్నారు.
6. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఈ ఘటనపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేసును పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించారని తెలిపారు.
7. సిద్ధూ మూస్ వాలా హత్య ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అందులో IPCలోని సెక్షన్లు: 302, 307, 341, 148, 149, 427, 120-B మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్లు 25 మరియు 27 కింద FIR నమోదు చేశారు.
8. సిద్ధూ మూస్ వాలా హత్య నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉపసంహరణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సిద్ధూ మూస్ వాలా కుటుంబం ఈ ఘటనను తల్చుకుని కన్నీరుమున్నీరవుతోంది. తల్లి తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
9. సిద్ధూ మూస్ వాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.. “నా కొడుకు కారు జవహర్కే గ్రామానికి చేరుకున్నప్పుడు, మేము మరొక తెల్లటి SUVని గుర్తించాము. నిమిషాల వ్యవధిలోనే కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు” అని పేర్కొన్నారు. హత్యపై ఎన్‌ఐఏ, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతేకాకుండా, సెక్యూరిటీ ఉపసంహరణ రహస్య పత్రాన్ని లీక్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
10. సిద్ధూ మూస్ వాలా హత్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధూ మద్దతుదారులు సోమవారం ఆసుపత్రి వెలుపల నిరసనకు దిగారు.
Share this content: