దర్వాజ-క్రికెట్
Team India New T20I Captain: టీ20 వరల్డ్ ఛాంపియన్ భారత జట్టుకు ప్రస్తుతం టీ20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ కావాలి. ఎందుకంటే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అయితే, టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే శుభ్ మన్ గిల్ తాత్కాలిక కెప్టెన్ గా భారత్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో కెప్టెన్సీని యంగ్ ప్లేయర్ గిల్ కు అప్పగించారు. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ సీనియర్ ఆటగాళ్లకు ఆప్షన్ మాత్రమేనా లేక బీసీసీఐ ప్లాన్ మరేదైనా ఉందా అనేది ఇప్పుడు కొత్త ప్రశ్న. ఏదేమైనా బీసీసీఐ చేసిన ఈ ప్రయోగం విజయవంతమవడంతో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ కు సారథ్యం వహించిన శుభ్ మన్ గిల్ ఇప్పుడు టీమిండియా పూర్తిస్తాయి కెప్టెన్ రేసులోకి వచ్చాడు.
భారత జట్టకు శాశ్వత టీ20 కెప్టెన్ ఎవరు?
జింబాబ్వే పర్యటనలో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. చాలా కాలంగా బ్యాట్ తో సతమతమవుతున్న గిల్ కు తనను తాను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం కాగా, ఇక్కడ కెప్టెన్, బ్యాటర్ గా నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ఆరంభం భారత్ కు షాకిచ్చింది. కానీ, తొలి మ్యాచ్ ఓడిన భారత్ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయంతో సిరీస్ ను కైవసం చేసుకుంది.
బ్యాట్ తో రాణించిన గిల్
ఐదు టీ20ల సిరిస్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటర్ గా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఓ ప్రత్యేక రికార్డును కూడా సృష్టించారు. వెటరన్ల ప్రత్యేక జాబితాలో శుభ్మన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. గిల్ 5 మ్యాచ్ లలో 170 పరుగులు చేశాడు. దీంతో అతడి పేరు ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో ప్రత్యేక జాబితాలో చేరింది.
హార్దిక్ పాండ్యాకు టెన్షన్ పెంచిన గిల్..
ఐదో టీ20 మ్యాచ్ అనంతరం శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ ‘కెప్టెన్సీని నేను ఆస్వాదిస్తాను. అది నాలోని మెరుగైన నైపుణ్యాలను వెలికి తీస్తుంది. నేను ఎల్లప్పుడూ ఆటలో ఉంటాను. మైదానంలో నేను పూర్తిగా ఆస్వాదించే నా వ్యక్తిత్వంలోని భిన్నమైన కోణాన్ని ఇది బయటకు తెస్తుంది’ అని గిల్ ఒక ప్రకటనలో తెలిపాడు. దీంతో తాను కెప్టెన్ రేసులో ఉన్నానని గిల్ సందేశాలు పంపాడు.
వన్డే, టెస్టుల్లో రోహిత్ శర్మనే కెప్టెన్
2021లో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో విరాట్ కోహ్లీ 231 పరుగులు చేశాడు. అంతేకాకుండా 2019లో వెస్టిండీస్ పై 183 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో కెప్టెన్ గా రోహిత్ శర్మ 162 పరుగులు చేయగా, గిల్ ఇప్పుడు అతడిని అధిగమించాడు. జింబాబ్వే సిరీస్ (2024) లో 170 పరుగులు చేశాడు. కాగా, వన్డే, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
కెప్టెన్సీ కోసం గిల్, హార్దిక్ పోటీ..
అయితే రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్ గా ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో రిషబ్ పంత్ కూడా కెప్టెన్ పదవి రేసులో ఉన్నాడు. మరోవైపు జింబాబ్వే పర్యటన విజయవంతమైన తర్వాత జట్టు యాజమాన్యం కూడా గిల్ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. గిల్ ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీని శుభ్మన్ గిల్ కు అప్పగించింది.