Breaking
Tue. Nov 18th, 2025

Bhu Bharati: రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు.. 8.58 లక్షల భూ సంబంధిత ఫిర్యాదులు

Bhu Bharati Revenue gram sabhas collect 8.58 lakh land issue applications
Bhu Bharati Revenue gram sabhas collect 8.58 lakh land issue applications

దర్వాజ-హైదరాబాద్

Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం భూ భారతి యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా మొత్తంగా 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

అత్యధిక ఫిర్యాదులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచే

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లాలో 67,000 దరఖాస్తులు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 61,000 దరఖాస్తులు వచ్చాయి. వాటి తర్వాత వరంగల్ (54,000), జయశంకర్ భూపాలపల్లి (48,000), నల్గొండ (42,000) జిల్లాలు ఉన్నాయి.

ఇవన్నీ భూ సంబంధిత ఫిర్యాదులే కావడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామా సంబంధిత కేసులు మినహాయించి, ఇప్పటివరకు 60 శాతానికి పైగా సమస్యలు పరిష్కరించగలిగినట్లు మంత్రి తెలిపారు.

భూ భారతి యాక్ట్ అమలులో మూడు దశలు

భూ భారతి యాక్ట్‌ను ఏప్రిల్ 14న తీసుకురాగా, దాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు.

మొదటి దశ (ఏప్రిల్ 17 – 30):

  • 4 మండలాల్లో
  • 72 రెవెన్యూ సమావేశాలు
  • సుమారు 12,000 దరఖాస్తులు

రెండవ దశ (మే 5 నుంచి ప్రారంభం):

  • 28 మండలాల్లో
  • 414 రెవెన్యూ సమావేశాలు
  • సుమారు 46,000 దరఖాస్తులు

మూడవ దశ (జూన్ 3 – 20):

  • 561 మండలాల్లోని 10,239 గ్రామాల్లో
  • రెవెన్యూ సమావేశాలు
  • 8 లక్షల దరఖాస్తులు స్వీకరణ

మొత్తంగా మూడు దశల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.

రైతులకూ సౌకర్యాలు

ప్రతి రెవెన్యూ సమావేశానికి ఒక రోజు ముందు రైతులకు వారి గ్రామాల్లో ఉచితంగా దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి దరఖాస్తులు స్వీకరించి, రసీదులు జారీ చేసినట్టు తెలిపారు.

ఆన్‌లైన్ నమోదులో పురోగతి

ఇప్పటి వరకు మొత్తం 3.27 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన నమోదు చేయాలంటూ అధికారులకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల నమోదు, పరిష్కార ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

Related Post