దర్వాజ-హైదరాబాద్
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) ఏప్రిల్ 2025లో 19.14 లక్షల కొత్త సభ్యులను చేర్చుకున్నట్లు సంస్థ విడుదల చేసిన తాజా పేరోల్ డేటా చెబుతోంది. ఇది మార్చి 2025తో పోలిస్తే 31.31 శాతం పెరుగుదల, అలాగే ఏప్రిల్ 2024తో పోలిస్తే 1.17 శాతం పెరుగుదల నమోదైంది.
కొత్తగా చేరినవారిలో 18-25 వయసు యువతే అధికం
ఈ నెలలో కొత్తగా చేరిన 8.49 లక్షల సభ్యుల్లో 4.89 లక్షల మంది (57.67%) 18-25 సంవత్సరాల వయసులో ఉన్న వారు. వీరంతా ప్రధానంగా కొత్తగా ఉద్యోగంలోకి అడుగుపెట్టినవారే కావడం గమనార్హం. మార్చితో పోలిస్తే ఈ వయసు వారిలో 10.05 శాతం పెరుగుదల నమోదైంది. ఈ వయస్సు గ్రూప్ లో నెట్ చేరికలు 7.58 లక్షలు, ఇది గత నెలతో పోలిస్తే 13.60 శాతం ఎక్కువ.
ఉద్యోగులకు భవిష్యత్ భద్రతపై అవగాహన పెరుగుతోంది
మునుపు ఉద్యోగాన్ని వదిలిన 15.77 లక్షల మంది సభ్యులు ఏప్రిల్‌లో EPFOలో తిరిగి చేరారు. ఇది మార్చి 2025తో పోలిస్తే 19.19 శాతం, ఏప్రిల్ 2024తో పోలిస్తే 8.56 శాతం పెరిగింది. వీరు ఉద్యోగం మార్చిన తర్వాత తమ మొత్తాలను తీయక, ట్రాన్సఫర్ చేసుకోవడాన్ని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్‌కు భద్రతను కల్పించుకుంటున్నారు.
మహిళా సభ్యుల సంఖ్యలో విశేష వృద్ధి
ఏప్రిల్ 2025లో 2.45 లక్షల కొత్త మహిళా సభ్యులు EPFOలో చేరారు. ఇది మార్చితో పోలిస్తే 17.63 శాతం అధికం. అంతేకాదు, మొత్తం నెట్ మహిళా చేరికలు 3.95 లక్షలుగా ఉండగా, మార్చితో పోలిస్తే 35.24 శాతం పెరిగింది. ఇది భారత కార్మిక రంగంలో లింగ సమత్వం పెరుగుతోందని సూచిస్తుంది.
ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న సూచనలు
ఈ మొత్తం డేటా చూస్తే దేశంలో సంస్థాగత ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. యువత ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నది, మహిళలు ఎక్కువగా కార్మిక రంగంలోకి వస్తున్నారు. EPFO నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కూడా ఈ పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
