తెలంగాణలో లాక్‌డౌన్ ?

lockdown in Telangana
lockdown in Telangana

దర్వాజ-న్యూఢిల్లీ

దేశ‌వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజూకు కేసుల విజృంభ‌న రెట్టింపు అవుతుంది. గ‌త 24 గంట‌ల్లో దాదాపు 19 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. రికార్డు స్థాయిలో 3,52,991 మందికి క‌రోనా పాజివిట్ గా నిర్ధారణ అయ్యింది. ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం.. నిమిషానికి దాదాపు 250 పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీన్ని బ‌ట్టి దేశంలో క‌రోనా తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్రతి రోజూ 2వేలకు పైగా మరణాలు సంభ‌విస్తున్నాయి. దేశవ్యాప్తంగా గంటకు దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 2,812 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీల్లో రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బెంగాల్ లోనూ ఇదే ప‌రిస్థితి.. పలు ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక్క‌రికి పాజిటివ్ గా నిర్థార‌ణ అవుతుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప‌రిస్థితితులు దారుణంగా మారుతున్నాయి.

తెలంగాణలో కేసులు, మరణాలు అధికమే !

తెలంగాణలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. క‌రోనా విజృంభ‌ణను దృష్టిలో పెట్టుకుని.. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కర్ఫ్యూ అమ‌లు అవుతున్నా.. కేసుల సంఖ్య తగ్గకపోగా, మరింత పెరగ‌డం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కొత్త కేసులు వేలల్లోనే నమోదవుతున్నాయి. నేడో.. రేపో ఇది పదివేల మార్క్‌ను దాటుతుంది. ఇది కేవ‌లం అధికారిక లెక్క‌లే.. ఇంకా అన‌ధికారికంగా ఉన్న కేసులెన్నో.. సొంత వైద్యం చేసుకుంటున్న బాధితులెంద‌రో.. ప్రాణాలు కోల్పోతున్న బాధితులెంద‌రో ..

ఆదివారం 38 మంది చనిపోయిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించినా.. గాంధీ ఆస్పత్రి, నిమ్స్‌తో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రతిరోజూ వందమందికి పైగానే చనిపోతున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గాంధీతో పాటు టిమ్స్‌లోనూ… ప్రతిరోజూ పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇంకా దారుణ‌మేమిటంటే.. ఆస్పత్రికి చేరేలోపే ప్రాణ‌వాయువు అంద‌క బ‌లైనవారు కోకొల్లలు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత, మందుల కొరత, వెంటిలేటర్లు, పడకల కొరత తీవ్రంగా ఉంది. మున్ముందు ఇదే పరిస్థితి కొన‌సాగితే.. మే10 నాటికి ప‌రిస్థితి మ‌రింత చేయిదాటిపోయి ప్రమాదకరంగా మారే అవ‌కాశమున్న‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఈ ప‌రిస్థితి నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాలంటే.. మ‌న ముందున్న ఏకైక మార్గం లాక్ డౌనే న‌ని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత లేకుండా ఇప్పుడే ఏర్పాట్లు చేసుకోవాలి. దీంతో రాబోయే పెనుముప్పు నుంచి కొంతమేర రక్షణ పొందగలం. కాబట్టి పరిస్థితి చేయిదాటిపోక ముందే .. తెలంగాణ సర్కారు అప్ర‌మ‌త్తం కావాలి.

ప్రస్తుతం మహారాష్ట, ఢిల్లీ, తమిళనాడు. బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప‌రిస్థితి మ‌రింత ఆందోళనకరంగా మారుతోంది. ఆయా ప్రాంతాలతో పోలిస్తే.. తెలంగాణ పరిస్థితి కాస్తా బెట‌రే అయిన‌ప్ప‌టికీ .. క‌రోనా విజృంభ‌ణ వేగంగా కొన‌సాగుతున్నది. ఇప్ప‌టికే అటు దీదీ స‌ర్కార్‌ను వైద్యులు హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తుంది. వారి స‌ల‌హా మేర‌కు బెంగాల్‌ ఎన్నికల తర్వాత లాక్‌డౌన్ విధించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

లాక్ డౌన్ విధిస్తే ఏం జరుగుతుంది?

ఇక లాక్‌డౌన్ విధిస్తే.. ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా తీవ్రంగా గండిపడే అవ‌కాశముంది. రోజు వారీ కూలీలు, వలస జీవులతో పాటు సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. దీనిని ముందస్తుగా ప్రభుత్వం అంచవేయడంతో పాటు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగాల్సిన అవశ్యకత చాలా ఉంది. ఇదే సమయంలో కరోనా కట్టడికి చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది.

క‌రోనా విలయతాండ‌వం చేస్తున్న వేళ‌.. మ‌రో వైపు.. మే 1 లేదా 8 తేదీల మధ్య ఎప్పుడైనా లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేంద్రం సైతం పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన ప్రాంతాలు, ఐసీయూలో 60 శాతం పడకలు నిండిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు సైతం ఇచ్చింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి !

Share this content:

Related Post