Darvaaja – Hyderabad
జనవరి 14న నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరిలో ఎన్నికలు
మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనంతరం
బీసీ రిజర్వేషన్లపై డిసెంబరు 10లోపు నివేదిక
‘ఇద్దరు పిల్లలు’ నిబంధన ఎత్తివేత
Telangana grama panchayat elections: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా, జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఫిబ్రవరి రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలను ముగించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సర్పంచ్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు.
రిజర్వేషన్లపై నిర్ణయం
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ డిసెంబరు 10 నాటికి సమగ్ర కులగణన నివేదికను అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ, మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.
సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా
తెలంగాణ వ్యాప్తంగా 12,867 పంచాయతీలు, 538 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండకపోయినా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతోనే జరుగుతాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది.

ఎంపీటీసీ స్థానాల పెంపు
కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం మినిమం ఐదుగురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ పదవులు కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఎన్నికల సిబ్బంది నియామకం
ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి పంచాయతీకి ఒక స్టేజ్-1 అధికారి, పోలింగ్ కేంద్రాలపరంగా అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించనున్నారు. వీరికి మార్గదర్శకాలు అందించడంతో పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ప్రణాళిక సిద్ధమైంది.

పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు
గ్రామపంచాయతీ వారీగా ఓటరు జాబితా సిద్ధమవగా, కొత్తగా చేరిన ఓటర్లను జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా కసరత్తు జరుగుతోంది. ఓటర్ల సంఖ్య 650 దాటితే అదనపు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.
రైతు భరోసా పూర్తిచేయాలన్న యోచన
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని నిర్ణయించింది.ఈ ఎన్నికలతో రాష్ట్రంలో స్థానిక పాలనా వ్యవస్థకు కొత్త ఆవిష్కరణలు తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.