- కరోనా టీకా ధరలపై తెలంగాణ మినిస్టర్ కేటీఆర్
దర్వాజ- హైదరాబాద్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లతో పాటు కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించే ఔషధాలకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా టీకాల ధరల వ్యత్యాసంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒకే దేశంలో రెండు ధరలేందుకు? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
టీకా ధరలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?ఒకే దేశం- ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, కరోనా టీకాలను ఇదివరకు కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేది. అయితే, కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టుగానే రాష్ట్రాలు కరోనా టీకాలను కోనుగోలు చేయవచ్చునని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీకాల ధరలను తయారీ సంస్థలు వెల్లడించాయి.
దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులకు అందించే కరోనా టీకా కోవిషీల్డ్ ధరలను పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ ఐఐ) బుధవారం ప్రకటించింది. కోవిషీల్డ్ ఒక్కోడోసును కేంద్రానికి రూ.150 కు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400, ప్రయివేటు ఆస్ప్రత్రులకు రూ. రూ.600కు ఇవ్వనున్నట్టు తెలిపింది.