దర్వాజ – హైదరాబాద్
Telangana Holidays: తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంగ్ వీకెండ్ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం నుంచి 7వ తేదీ ఆదివారం వరకు వరుసగా మూడు రోజుల సెలవులు ఉండబోతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో కుటుంబాలతో గడిపే సమయం, పర్యటనలు, విశ్రాంతి ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీ లభించనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు అన్ని ఈ సెలవులను పాటించనున్నాయి.
మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనంతో సెలవులు
సెప్టెంబర్ 5న ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ఇచ్చింది. ఈ రోజు ప్రవక్త మహ్మద్ జయంతి కావడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయనున్నారు.
తదుపరి రోజు, సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చారు. హైదరాబాద్ నగరం ఈ వేడుకలతో ప్రత్యేక శోభ సంతరించుకోనుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
సెప్టెంబర్ 7 ఆదివారం కావడంతో సహజంగానే సెలవు వస్తోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభిస్తోంది.
సెప్టెంబర్‌లో మరిన్ని సెలవులు
ఈ లాంగ్ వీకెండ్ తో పాటు సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు మరిన్ని సెలవులు ఎదురుచూస్తున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దాదాపు రెండు వారాల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే విడుదలైన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో ఈ నెలలో విద్యార్థులకు పది రోజులకు మించి పండుగల సెలవులు రానున్నాయి.
