దర్వాజ-హైదరాబాద్
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కేసీఆర్‌పై పోటీ చేయడంపై తాను ఊరికే మాటలు చెప్పలేదనీ, చాలా సీరియస్ గా ఉన్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌లో రాజేందర్‌కు చెందిన ముదిరాజ్ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నందున, ఆయనను కేసీఆర్‌పై పోటీకి దింపాలనే డిమాండ్ ఆ నియోజకవర్గ బీజేపీ నేతల నుంచి కూడా వ్యక్తమవుతోంది.
వివరాల్లోకెళ్తే.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పై పోటీ చేస్తానన్న తన ప్రకటనపై తాను సీరియస్‌గా ఉన్నాననీ, కాషాయదళం చేతిలో ఓటమి తప్పదని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను ఓడించేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారనీ, పలువురు మంత్రులు, ఇతర నేతలు అధిష్టానంపై దృష్టి సారించడంతో అధికార యంత్రాంగం మొత్తం నియోజకవర్గంపైనే దృష్టి పెట్టిందని మాజీ మంత్రి విలేకరులతో అన్నారు.
తన పార్టీ నుంచి మరొకరిని పోటీకి దింపకుండా తనపై పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ చేశానని రాజేందర్ తెలిపారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమనీ, మాటపై నిలబడ్డారని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2018లో గజ్వేల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముఖ్యమంత్రి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ లేదా గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేదు కానీ, బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 30న జరిగే ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.