దర్వాజ-హైదరాబాద్
Telangana: రాష్ట్రంలో చికెన్ ధరలు (Chicken prices) ఆకాశాన్నంటుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో రూ.175కు విక్రయిస్తున్న కోడి మాంసం.. ప్రస్తుతం ధరలు కిలోకు రూ.280కి విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కోళ్ల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చికెన్ ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. శీతాకాలం ముగియడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల నుండి 39 డిగ్రీల సెల్సియస్‌ను ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇది కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమైంది.
అలాగే, దాణా ధరల ప్రభావం కూడా చికెన్ రేట్లపై పడింది. ఇటీవల చికెన్ ఫీడ్ రేటును ఉత్పత్తి వర్గాలు పెంచడం వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. భారతీయ (దేశీ) కోడి (నాటు కోడి) మాంసం రేటు కూడా పెరుగుతోంది. కిలో మాంసం రూ.400 నుంచి 500 కిలోల వరకు విక్రయిస్తున్నారు. దేశీ చికెన్ ధర ఇంతలా పెరగడానికి కారణం డిమాండ్ కు తగిన స్థాయిలో ఇవి అందుబాటులో లేకపోవడమే. ఇక నాటు కోళ్ల రకాలను బట్టి వీటి ధర మరింతగా పెరుగుతోంది.