దర్వాజ-హైదరాబాద్
Hyderabad : హైదరాబాద్ కు మెట్రో, ఫార్మా సిటీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీ ప్లాన్‌లను తమ ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తలను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఖండించారు. “ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము దీన్ని క్రమబద్ధీకరిస్తున్నాము. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలతో పోల్చితే విమానాశ్రయానికి దూరాన్ని, ఖర్చును తగ్గిస్తాం’’ అని అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు.
మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్ వేయనున్నట్లు తెలిపారు. నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్, ఒవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయణ్ గుట్ట వరకు ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌కు అనుసంధానం చేస్తామనీ, అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో లైన్‌ను పొడిగిస్తామని చెప్పారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ కూడా సరిపోదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Diabetes: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే చిట్కాలు మీ కోసం..
“మా ప్రతిపాదిత కొత్త మెట్రో లైన్లకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా రింగురోడ్డు, ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య ఫార్మా సిటీగా క్లస్టర్లను రూపొందిస్తాం. జీరో పొల్యూషన్‌తో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మారుస్తామని చెప్పారు. నామినేటెడ్ పదవులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారితోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు.