Heavy rains: జంట జలాశయాల నాలుగు గేట్లు ఎత్తివేత..

Hyderabad, Rains, Secunderabad, Himayat Sagar Lake, Osman Sagar

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Himayat Sagar Lake: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద నీరు వస్తోంది. ఇప్పటికే రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. జలమండలి అధికారులు జంట జలాశయాల చెరో రెండు గేట్లను మంగ‌ళ‌వారం ఉదయం 8 గంటలకు 2 అడుగుల మేర ఎత్తారు.

హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 1373 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 442 క్యూసెక్కుల నీటిని కిందనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత వివిధ శాఖల అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు.

ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌లోని లోయర్‌ బ్రిడ్జి సమీపంలోని కాలనీ వాసులు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ముసారం బాగ్ వంతెన వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Post