దర్వాజ-హైదరాబాద్
tomato price: దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాటో ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. మామిడి ధరల కంటే టమాట ధరలే ఇప్పుడు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కేజీ టమాటో ధర సెంచరీ దాటగా.. జూన్ చివరివరకు ఇదే పరిస్థితి ఉంటుందనీ, కేజీ టమాటో ధర 150 రూపాయల వరకు పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు పెర్కొంటున్నాయి.
హైదరాబాద్ మామిడికాయల కంటే టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. టమాటాను రిటైల్ మార్కెట్లో కిలో 100 రూపాయలకు పైనే విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో టమాట ధర రిటైల్ మార్కెట్లో కిలోకు 90-110 రూపాయలు ఉండగా.. మామిడి పండ్లను కిలోకు 50-80 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ టమాట ధరలు షాకిస్తున్నాయి. యెమ్మిగనూరు, ఆదోని, కర్నూల్ లలో రిటైల్ దుకాణాల్లో టమాటా కిలో రూ.130కి విక్రయిస్తున్నారు. టమోటా వ్యాపారం జరిగే రాష్ట్రంలోనే అతిపెద్ద యార్డులలో ఒకటైన పత్తికొండలోని హోల్సేల్ మార్కెట్లో టమోటాలు గరిష్టంగా కిలోకు రూ.80 నుండి రూ.90 వరకు విక్రయించబడ్డాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. ఒక కేజీ టమోటా రిటైల్ ధర రూ.100 మార్కును దాటింది. గత రెండు వారాల్లో టమాట ధర దాదాపు రెండింతలు పెరిగింది. పాలి మార్కెట్ బాంద్రా, మాతుంగా, ములుండ్ మరియు బైకుల్లాతో పాటు ఆన్లైన్ స్టోర్లలో 1 కిలోల టమోటాలు సెంచరీ మార్కును దాటాయి. రానున్న రోజుల్లో 150 వరకు చేరే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా.