దర్వాజ-హైదరాబాద్
TSPSC exams cancelled after paper leak: ఆన్ లైన్ లో ప్రశ్నాపత్రం హ్యాకింగ్ కు గురైందన్న అనుమానంతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్యవేక్షకుడు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బేగం బజార్ పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీజర్ పోస్టుకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అలాగే, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు మార్చి 15, 16 తేదీల్లో ఆన్లైన్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే, పరీక్షల పేపర్లు లీక్ కావడంతో పరీక్షలను వాయిదా వేసినట్టు టీఎస్ ఎపీఎస్సీ తెలిపింది. పరీక్ష కొత్త తేదీలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది.
ఈ ఘటనపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని, టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ఒకరు పేపర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు.