హైదరాబాద్-దర్వాజ
TSRTC workers protest: ప్రజా రవాణా సంస్థకు చెందిన 43474 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేయడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రెండు గంటల పాటు నిరసన తెలిపారు. నిరసనల్లో భాగంగా ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు విధులను బహిష్కరించడంతో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సేవలు ఆలస్యమయ్యాయి.
ఈ నిరసనలకు నేతృత్వం వహించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కూడా ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ ముందు నిరసనలు చేపట్టాలని నిర్ణయించి కార్మికులంతా నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. ఈ నిరసనల కారణంగా ప్రజారవాణా ప్రయాణికులు నగరంలోని పలు బస్టాపుల్లో వేచి ఉన్నారు. అయితే, ఆర్టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చడం)పై సంతకం చేస్తామని చెబుతూనే.. ఈ ప్రక్రియకు మరింత సమయం పడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 43 వేలకు పైగా ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మార్గదర్శకాలను రూపొందించేందుకు అధికారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా వర్గీకరించి, వారు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు. కాగా, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.