దర్వాజ-న్యూఢిల్లీ
Uttarakhand’s sinking town Joshimath: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర ప్రాంతం జోషిమఠ్ లో పగుళ్లు మరింత పెద్దగా పెరుగుతున్నాయి. పగుళ్లు గతంలో కంటే ఎక్కువ సైజులో రెండు అంగుళాలు దాటి ఇప్పుడు 8-9 అంగుళాలకు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అక్కడి ప్రజల రక్షణపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వారిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
జోషిమఠ్ పగుళ్లుపై కేంద్రం హైలెవల్ మీటింట్
జోషిమఠ్ పగుళ్లపై చర్చించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే, జోషిమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు.
స్థానికులను తరలించడానికి చర్యలు..
జోషిమఠ్ పగుళ్లు క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదకరంగా మారిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ 600లకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
జోషిమఠ్ ను లో సీఎం పర్యటన..
జోషిమఠ్ పగుళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే, పగుళ్లు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలతో ఒక బృందం ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు.
ఎన్టీపీసీ సొరంగమే కారణమంటున్న స్థానికులు
జోషిమఠ్ లో పగుళ్లపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పగుళ్లు క్రమంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే, ఈ పగుళ్లకు కారణం ఎన్‌టీపీసీ సొరంగం కారణమని ఆరోపిస్తున్నారు. అక్కడ జరుగుతున్న పేలుళ్లుతో పగుళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన ఎన్టీపీసీ పేలుళ్లు జరపడం లేదని తెలిపింది.