World Malaria Day: ప్రపంచ మలేరియా దినోత్సవం ఎందుకు జ‌రుపుకుంటారు?.. దీని థీమ్, చరిత్ర & ప్రాముఖ్యత

World Malaria Day
World Malaria Day

World Malaria Day 2022: మానవాళికి ముప్పుగా కొనసాగుతున్న ప్రాణాంతక వ్యాధి మ‌లేరియా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ప్రపంచ పౌరులలో దాదాపు సగం మందికి మలేరియా వచ్చే ప్రమాదం ఉంద‌నీ, ముఖ్యంగా పేద దేశాలలో నివసించే ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization) డేటా ప్ర‌కారం.. 2020లో 241 మిలియన్ల మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. ఎక్కువ కేసులు ఆఫ్రికాలో నమోదయ్యాయి. మలేరియా సరైన చికిత్సతో నయం చేవ‌చ్చున‌నీ, దీనిని నివారించగల వ్యాధి అని WHO పేర్కొన్నప్పటికీ.. తగినంత ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఇప్పటికీ మ‌లేరియాతో మరణిస్తున్నారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం చరిత్ర :
ఆఫ్రికన్ మలేరియా దినోత్సవం నుండి ఈ రోజు అభివృద్ధి చెందింది. ఆఫ్రికాలోని ప్రభుత్వాలు 2001 నుండి మలేరియా దినోత్సవాన్నిజ‌రుపుకుంటున్నాయి. అయితే, 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ 60వ సెషన్‌లో ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని ప్రపంచ మలేరియా దినోత్సవంగా గుర్తించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మ‌లేరియా వ్యాధి ప్రభావాన్ని అంచ‌నావేయ‌డానికి ప్రతిపాదించారు. మొదటి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని 2008లో జ‌రుపుకున్నారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రాముఖ్యత :
ఈ ప్రాణాంతక మ‌లేరియా వ్యాధి గురించి అవగాహన పెంచడానికి మరియు దానిని నివారించడానికి ప్రజలు కలిసి రావాలని ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు. దీనిలో భాగంగా మ‌లేరియాకు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటంలో దాతలు చొరవ కోసం నిధుల సేకరణను నిర్వహించడం జ‌రుగుతుంది. మ‌లేరియాకు సంబంధించి ఏదైనా శాస్త్రీయ పురోగతిని కమ్యూనికేట్ చేయడానికి పరిశోధన, విద్యా సంస్థలను ఏక‌తాటిపైకి తీసుకురావడం కూడా దీని లక్ష్యంగా ఉంది.

అనేక సంస్థలు మరియు వ్యక్తులు ఈ రోజున మలేరియాపై పరిశోధనలో పాల్గొన్న కార్యక్రమాలకు డబ్బును విరాళంగా అందిస్తారు. వ్యాధిపై వెలుగులు నింపడానికి, దాని చికిత్సను హైలైట్ చేయడానికి మరియు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అనే విష‌యాల‌ను తెలుపుతూ.. ఈవెంట్‌లు మరియు సెమినార్‌లు నిర్వహించబడతాయి.

ప్రపంచ మలేరియా దినోత్సవం 2022 థీమ్ :
ప్ర‌తి ఏడాది ఒక థీమ్ తో ప్ర‌పంచ మ‌లేరియా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవం థీమ్ “మలేరియా వ్యాధి భారాన్ని తగ్గించడానికి, ప్రాణాలు పోకుండా కాప‌డ‌టం కోసం కొత్త‌ ఆవిష్కరణలను ఉపయోగించుకోండి”.

Related Post