Breaking
Sat. Jun 28th, 2025
my poetry
my poetry

ప్ర‌యాణం

ఈ జీవనయానంలో ఒంటరిని కాను
నా వెంట పెద్ద సమూహమే కడలి వస్తుంది.
నేను కాలు మోపితే ఎడారిసైతం
నందనవనం అవుతుంది.
నా కరచాలనం సోకితే కఠినపాషణం
సైతం కరిగిపోతుంది.
నేనెప్పుడు నా పెదవుల కొమ్మపై
చిరునవ్వుల పూవులు పూయిస్తు ఉంటాను.
సాహిత్య ఆకాశంలో కవితలపిట్టలని ఎగురవేస్తుంటాను.
ఆత్మవిశ్వాసం నా గుండెచప్పుడు.
ప్రవహించే ప్రేమ నదిని నేను.
స్నేహానికి నిలువెత్తు సంతకం నేను.

విహారానికి వెళ్తే..

అక్కడున్న నుసిగట్టిన దీపం నుండి
అసృశ్యతా కిరణాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి.
సిద్దార్థుడి ఆలోచనలు మస్తిష్కం నిండా నింపుకుని
పచ్చిగొంతుకల రాగం విందామని
అర్థరాత్రి ఇల్లు వదిలి విహారానికెళ్లాను.
రొచ్చు రొప్పులతో..
శ్మశానాన్ని తలపిస్తున్నాయి.
కొన్ని లోగిళ్ళు, కొందరు రాతి మనుషులు
వర్ణ వ్యవస్థతో ఇంకా అభిషేకాలు చేసుకొంటున్నారు.
కొందరు మరమనుషులు
మతం మత్తులో మారణ హోమాలు చేస్తున్నారు.
కొందరు విప్లవగీతాలు పాడుకొంటూ
కొత్త ఉదయం కోసం ఇంకా వేచి ఉన్నారు.
నాకనిపిస్తుందిప్పుడూ, ఎప్పుడూ
మన మధ్య రంగుల గోడలు లేవు, ఉండవని
ఈ విశాల ప్రపంచంలో..
రంగు రుచి వాసన తెలియని
క్రొత్త మనుషుల, క్రొంగొత్త మతాన్ని
పునఃప్రతిష్టించు కొంటామని
మనిషిగా మళ్లీ పునర్జన్మిస్తమని..

కాలానిదేముంది ?

ఒక్కసారిగా కాలమాగినట్లు లేదూ..
ఏం జాలమేసావో..
కనుల కలయిక ఎంత మధురమో తెలియడానికి
విరహాల ఉప్పెన ఆగి సరసాల ఊయలలో మది ఇంతలా ఊగుతుందా.!
ఎక్కడి నువ్వు..? ఎక్కడి నేను !
మిరుమిట్లు గొలిపినట్లు
హృదయాంతరాళంలో ఏదో మెరుపు మెరిసినట్లూ..
ఆద్యంతం నీ ప్రత్యక్షం
నా పరోక్షాన్ని పరీక్షిస్తున్నట్లుంది కవిత్వమా..
ఇక కాలానిదేముంది ?
అదెప్పుడు విందని నా మాట నీ బాటలోకి నేనొచ్చాక.

ఏకాగ్ర‌త‌

గురిచూసి కొట్టాలి
బ్రతుకులో బాధనైనా
కావలసిన జీవితఫలంనైనా
కొన్ని కనుమరుగై పోవడానికి
కొన్ని చెంతచేరి మురిపించడానికి
జీవితం మనకు నచ్చినట్లు మలుచుకోవడమే
మనసు భారాలు దించుకోవడమే
కావలసినదంతా సాధించాలనే ఏకాగ్రత ఒక్కటే
అందేవరకు సాధన చేయడమే
ఓ వేటగాడిలా ఒ ఏకలవ్యుడిలా
అదే జీవన పయనం
నీ నా గమనం!

విశ్వాసాల‌కు న‌రాల బ‌ల‌హీన‌త ఏలా ?

మండుటెండలో మానవత్వానికి వడదెబ్బ కొట్టింది.
పంచభూతాలను కామాత్మ ఆవహించింది.
నిర్భయం గుండెనిండా పీల్చకున్న మృగాళ్ల
తోడేళ్ల గుంపు నాయకత్వ హవా నడుస్తోంది.
గర్భం చీల్చుకుని పుట్టిన గతాన్ని
గాఢ సుషుప్తిలో మరిచిపోయిన మగతనం
అమ్మతనాన్ని అంగట్లో ఆరడి పెడుతోంది.
సంప్రదాయాల తలలు పట్టక్కూర్చున్న
తలపండిన వేదాంతులు తకరారు పడిపోతూ
సిగ్గునూ తలకెత్తుకుంటున్నారు.
విశ్వాసాలకు నరాలబలహీనత ఎందుకచ్చిందని ?

వాక్కు

భాషణం నిజంగా మనిషికి భూషణం
మితభాషణం, మృదుభాషణం,
సత్యభాషణం మనిషికి పెట్టని ఆభరణాలు.
వాక్కు భగవదత్తమైన ఓ శక్తి
దాన్ని దుర్వినియోగపరచకూడదనేది ఓ సూక్తి.

అక్ష‌రం

అక్షరం చీకటిని తరిమే వెలుగు కిరణం
అక్షరం విజ్ఞానాన్ని ప్రసాదించే సాధనం
అక్షరం సాహిత్యకారులకి దొరికిన వరం
అక్షరం అవినీతిని అంతం చేసే ఆయుధం
అక్షరం నిద్రపోతున్న సమాజాన్ని మెల్కోలిపే ఉషోదయం

న్యాయం

న్యాయదేవతకు కళ్లగంతలు కట్టి
అన్యాయాలను యథేచ్ఛగా
మాకు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందన్నట్లుగా
చేస్తున్న అరాచకాలకు కారకులెవరో
కళియుగాంతం వరకైనా కానరాకపోరా !
ఈ స్వతంత్ర భారతంలో
న్యాయానికి కూడా న్యాయం కరువైంది
అనడంలో అతిశయోక్తి లేదు.

భ‌విష్య‌త్తు

మన భవిష్యత్తు
రేపు చెయ్యబోయే దానిపై కాదు
నేడు చేసే దానిపైన నిర్మించబడుతుంది.
ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది
రేపటి నుండి కాదు.. నేటి నుండే..
కాదు కాదు ఈ క్షణం నుండే..

మారాల్సింది

మనిషిలో మారాల్సింది వేషధారణ,
ఆర్ధికపరమైన స్థితిగతులే కాదు.!
మనిషిని మనిషి అర్థం చేసుకునే తీరు.
చేసే సహాయం తాలుకు పబ్లిసిటీ.
మానవత్వపు రంగులు పులుముకుని
చేసే రాక్షసక్రీడల ఆనవాళ్లు.
(ఇలా ఎన్నో ఎన్నెన్నో)

ప్రియ‌త‌మా..

హృదయపు చినుకువలె
అలా వచ్చి నాలో అలజడి రేపి వెళ్తావ్మ
మ‌ళ్ళీ వస్తావని అలసి సొలసి
సేదతీరే సమయంలో
ఒక ఉప్పెనలా వచ్చి
ఊరించి మాయం అవుతావ్!
ఎంత కాలం ఈ ఎదురుచూపులు
నువ్వు వస్తావని ఎదురుచూసే ఈ కళ్ళను
చివరికి చితిమంటల వరకు ఈ ప్రాణాన్ని దక్షిస్తావా ?

image_2021-03-03_034507 నా కవిత్వం

ర‌చ‌యిత: ర‌వి మిట్ట‌ప‌ల్లి, MA, LLM
సిద్ధిపేట‌

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

ఏందే అన్నా.. ఎట్లున్నా క‌ష్ట‌మేనా ?

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

ప్రేమంటే సంపేసుడేనా ?

Related Post