హరహర మహాదేవ శంభో శంకర..
దుఃఖ హర..
భయ హర..
దారిద్ర హర..
అనారోగ్య హర..
ఐశ్వర్య కర..
ఆనందకర..
అంటూ ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోయే సమయం రానే వచ్చేసింది. శివోహం అంటూ.. భక్త జనం శివనామస్మరణలో ఊగిపోయే మహా పవిత్ర దినం దగ్గర్లోనే ఉంది. మహా శివరాత్రి పర్వదినం నాడు ఏ పుట్ట చూసినా.. ఏ గుడి చూసిన శివ భక్తులతో నిండిపోతుంది. శివనామస్మరణతో దద్దరిల్లుతుంది.
ప్రతీ యేడు మాఘ బహుళ చతుర్ధశి రోజును మహా శివరాత్రిగా జరుపుకుంటారు. ఆ రోజు సంభ శివునికి ఎంతో ఇష్టమైనరోజు. సృష్టి, స్థితి, లయల్లో.. శివుడే లయకారకుడు. పరిమితి లేని శక్తికి రూపం భోళ శంకరుడు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదని ఎంతో మంది నమ్మకం. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పిలుస్తారు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా పురాణాలు చెబుతున్నాయి.
ఈ మహాశివరాత్రి రోజు మణికంఠునికి ప్రత్యేక పూజలను ప్రపంచం అంతా చేస్తుంది. ఆ సమయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో జరిగే పూజలు మరీ ప్రత్యేకం. ఆ పూజల్లో పాల్గొంటే జన్మ సార్థకత అవుతుందని ఎంతో మంది నమ్ముతారు. ఆలాంటి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. వాటి గురించి దర్వాజ. కామ్ మీకు ఎక్లూజివ్ గా సమాచారం అందించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుని పరమ శివున్ని మనసారా స్మరించుకుంటారని ఆశిస్తున్నాం..
ఏడు జన్మల నుంచి చేసిన పాపాలు పోవడంతోపాటుగా సన్మార్గ వర్తనలు కావడానికి కీస్తోత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంతో మంది నమ్ముతుంటారు. కేవలం స్మరించుకోవడం వలన సంకల్ప సిద్ది కలుగుతుందనీ ఎంతోమంది నమ్మకం.
” ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !
శ్రీ శైలే మల్లికార్జునం !!
ఉజ్జయిన్యాం మహాకాళం !
ఓంకారే పరమేశ్వరం !!
కేదారం హిమవతః పృష్ఠేః !
ఢాకిన్యాం భీమశంకరం !!
వారణాస్యాం తు విశ్వేశం !
త్ర్యంబకం గౌతమీతటే !!
వైద్యనాధం చితాభూమౌ !
నాగేశం దారుకావనే !!
సేతుబంధే చ రామేశం !
ఘశ్మేశం చ శివాలయే !!”
ఈ కీసోత్రంలో ద్వాదశ జోతిర్లింగాల గురించి చెప్పబడింది. ఈ జోతిర్లింగాలకు ఎంతో చరిత్ర అలాగే ప్రాముఖ్యత ఉంది. ఈ పన్నెండు జ్యోతిర్లిగాలను ను చూస్తే చాలు శివుడి కృపా కటాక్షాలు లభించి, మోక్షం కూడా సిద్ధిస్తుందని పలువురు నమ్ముతారు. సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపంలోకి మారిపోయాడని పురాణాలు చెబుతాయి. జ్యోతిర్లింగం అంటే లింగ రూపంలో శివుడిని ఆరాధించే చోటు. ఎంతో పవిత్రంగా భావించే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నయో ఇక తెలుసుకోండి.
1.సోమనాథ్ ఆలయం
మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిది. గుజరాత్ లోని సౌరాష్ట్ర జిల్లాలో ఈ సోమనాథేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన తన లీలతో వెలిగించిన దీపం ఈ రోజుకూ వెలుగుతూ ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న చంద్రకుండంలో స్నానం చేస్తే.. పాపలు పోతాయని ఎంతో మంది శివ భక్తులు నమ్ముతారు. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతాయి.
2.శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయం కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వేస్టేషన్ నుంచి 52 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
3.రామేశ్వరాలయం
తమిళనాడులో శ్రీ రామేశ్వరాలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలికి చాలా ప్రముఖ్యత ఉంది. రామ, రావణ యుద్ధంలో రాముడి గెలుపునకు గుర్తుగా దీన్ని కట్టారని అక్కడి వాళ్ల నమ్మకం. రామేశ్వరంలో ఉన్న బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు పోతాయని శివ భక్తుల విశ్వాసం. ఇక్కడ 64 తీర్థాలు(నీటి ఆవాసాలు) ఉన్నాయి.
4.మహాకాళేశ్వర ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ పట్టణంలో మహా కాళేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం రుద్రసాగరం సమీపంలో ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వలన ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగంగా ఈ ఆలయానికి పేరు. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగంగా ఈ ఆలయాన్ని చెబుతుంటారు. ఇక్కడి గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉంటుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి గా పిలుస్తారు. ఉజ్జయినిలో శివలింగాలు మూడుఅంతస్థులుగా ఉంటాయి. కింద ఉండే లింగాన్ని మహా కాళ లింగం అంటారు. మధ్యలో ఉండే లింగాన్ని ఓంకార లింగం, పైన ఉండే లింగాన్ని నాగేంద్ర స్వరూపమైన లింగంగా పిలుస్తారు.
5.ఓంకారేశ్వరుడి ఆలయం
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వరుడి ఆలయం ఉంది. వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్య నర్మదా నది, ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందట. అందుకే ఈ క్షేత్రాన్ని ఓంకారేశ్వర క్షేత్రం అని పిలుస్తారట.
6.భీమేశ్వరాలయం
మహారాష్ట్రలో సహ్యాద్రి కొండల్లోఈ ఆలయం ఉంది. పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయిన భీమనది ప్రారంభమయ్యే ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగం వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది.
7.త్రయంబకేశ్వరాలయం
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా పరమ శివుడు వెలిశాడని ఎంతో మంది నమ్మకం.
8.ఘృష్ణేశ్వరాలయం
మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో విఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. దేవగిరి కొండపై ఉన్న ఈ ఘృష్ణేశ్వరుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
9.నాగనాథేశ్వరాలయం
గుజరాత్ లోని సౌరాష్ట్రలో ఈ ఆలయం ఉంది. అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ గాథల్లో ఉంది. ఈ ఆలయానికి సంబంధించి కొంత వివాదం ఉంది. రెండు,మూడు చోట్ల ఉన్న ఆలయాలను నాగనాథ జ్యోతిర్లింగంగా చెబుతుంటారు. కానీ ఎక్కువగా సౌరాష్ట్రలో ఉన్న ఆలయాన్నే జ్యోతిర్లింగంగా చెబుతారు.
10.వైద్యనాథేశ్వరాలయం
జార్ఖండ్ లోని సంతాల్ పరగణ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర ఉన్నపెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఈ రెండింటి నేపథ్యం రామాయనంతో ముడిపడి ఉందని నమ్ముతారు.
11.విశ్వనాథేశ్వరాలయం
ఈ ఆలయం కాశీలో ఉంది. గంగానది తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో పేరు ఉంది. అవిముక్త జ్యోతిర్లింగంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు.ఈ ఆలయంలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. ఈ ఆలయంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి మరుజన్మ ఉండదని ఎంతో మంది నమ్ముతారు.
12.కేదారేశ్వరుడి ఆలయం
ఉత్తరాఖండ్ లో ఈ ఆలయం ఉంది. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు.ఈ ఆలయం ఎంతో మహిమ కలిగిందిగా చెబుతారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి ఉన్నాయి.
శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ?
Share this content: