దర్వాజ-న్యూఢిల్లీ
కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. తాజాగా కోవిడ్-19 చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది.
బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ హాస్పిటల్ లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఇరాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, రక్షణ శాఖలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది.
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 82 మందిలో రోగులతో పాటు వారి వెంటవున్న వారు కూడా ఉన్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ఉన్నారనీ, మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని ఇరాక్ ప్రభుత్వం పేర్కొంది. సహాయ చర్యలు పూర్తయిన తర్వాత మరణాలపై పూర్తి సమాచారం వెల్లడిస్తామని ప్రకటించింది.
ఈ ప్రమాదంపై ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కదీమీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అలాగే, ఆస్పత్రి మేనేజర్, భద్రతా మేనేజర్, పరికరాల నిర్వహణ చూసే అధికారులకు నోటీసులు సైతం జారీ చేశారు. దీనిపై విచారణ జరపాలని ఆధికారులను ఆదేశించారు.
Share this content: