Breaking
Tue. Nov 18th, 2025

ఆఫ్ఘాన్ల‌పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి?

afghanistan crisis
afghanistan crisis

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

afghanistan crisis:ఆఫ్ఘానిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాలిబన్ల క్రూర చర్యలకు భయపడి లక్షలాది మంది ఆఫ్ఘాన్‌లు దేశాన్ని విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లను రక్షించుకోవడానికి సరిహద్దు కంచే అవతలవున్న భద్రతా బలగాల చేతుల్లోకి పిల్లల్ని విసిరేస్తున్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఆఫ్ఘాన్‌ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాలిబన్లు వారిపై తూటాల వర్షం కురిపిస్తుండటంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రపంచ దేశాలు కదిలిస్తున్నాయి. తాలిబన్ల క్రూర చర్యలను ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా దేశాలు ఆఫ్ఘాన్‌ ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు ద్వారాలు తెరుస్తున్నాయి.

ఆఫ్ఘాన్‌లోని సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్‌ ‘ఆఫ్ఘానిస్థాన్‌ పొరుగు దేశాలు సరిహద్దులను తెరిచి ఉచాలంటూ’ పిలుపునిచ్చింది. ప్రస్తుతం 2.6 మిలియన్ల మంది ఆఫ్ఘాన్‌ ప్రజలకు పాకిస్థాన్‌, ఇరాన్‌ దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అమెరికా సైతం ఇప్పటికే వారి విమానాల ద్వారా 1200 మంది ఆఫ్ఘాన్లను తీసుకెళ్లి.. యూఎస్‌లో ఆశ్రయం కల్పించింది. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా మరో 3,500 మందికి ఆశ్రయం కల్పించేందుకు అగ్రరాజ్యం ముందుకు సాగుతోంది. ఇదివరకు యూఎస్‌ బలగాలకు సాయపడిన 10 వేల మంది ఆఫ్ఘాన్‌ ప్రజలకు సైతం అమెరికా ఆశ్రయం ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడిరచాయి.

20 వేల మంది ఆఫ్ఘాన్‌ శరణార్థులకు తమ దేశంలో పునరావాసం కల్పిస్తామని గతవారం కెనడా ప్రకటించింది. బ్రిటన్‌ సైతం 5 వేల మంది ఆఫ్ఘాన్లకు ఆశ్రయం కల్పిస్థామని తాజాగా వెల్లడించింది. శరణార్థులకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక లేకున్నప్పటికీ భారత్‌ సైతం అనేక మంది ఆఫ్ఘాన్‌ పౌరులను ఇప్పటికే దేశానికి తీసుకువచ్చింది. ఆఫ్ఘాన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉజ్బేకిస్థాన్‌, నార్త్‌ మాసిడోనియా, ఉగాండా, అల్బేనియా అండ్‌ కోసోవో, టర్కీలు సైతం ఉన్నాయి.

Related Post