పిల్లలపై వాతావరణ సంక్షోభం

Climate Crisis Impacts UNICEF
Climate Crisis Impacts UNICEF

◘ అత్యంత ప్రమాదంలో సగం మంది చిన్నారులు
◘ దక్షిణాసియాలో టాప్‌లో భారత్‌, పాక్‌, బంగ్లా, ఆఫ్ఘన్‌ దేశాలు
◘ యూనిసెఫ్ నివేదిక వెల్లడి

ద‌ర్వాజ‌-న్యూఢల్లీ
Climate Crisis Impacts UNICEF: ప్రపపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వసం కొనసాగుతోంది. దీని కారణంగా మానవాళితో పాటు అనేక జీవుల మనుగడ ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే అనేక అధ్యయనాలు వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూనిసెఫ్ నివేదిక సైతం ఇలాంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల వల్ల పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణపై తీవ్ర ప్రభావం పడుతున్నదనీ, పర్యావరణ మార్పులు చిన్నారుల జీతానికి శాపంగా మారుతున్నాయని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది.

పిల్లలపై పర్యావరణ మార్పు ముప్పు అధికంగా ఉన్న దక్షిణాసియా నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఒకటని వెల్లడించింది. ‘ది క్లైమేట్‌ క్రైసిస్‌ ఈజ్‌ ఏ చైల్డ్‌ రైట్స్‌ క్రైసిస్‌: ఇంట్రడ్యూసింగ్‌ ది చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌’ (సీసీఆర్‌ఐ) పేరుతో పర్యావరణ మార్పుల కారణంగా పిల్లలపై పడుతున్న ప్రభావం, ఆయా ప్రాంతాల్లో చిన్నారులు జీవిస్తున్న పరిస్థితులను పేర్కొంటూ యూనిసెఫ్‌ తాజాగా ఓ నిదికను విడుదల చేసింది.

ప్రకృతి ప్రకోపాలు, తుఫానులు, వేడి గాలులు వంటి పర్యావరణ పరిస్థితులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. పిల్లలపై ప్రభావం, వారి జీవిస్తున్న పరిస్థితులకు సంబంధించిన పలు అంశాలు ఆధారంగా ప్ర‌పంచ దేశాలకు ర్యాంకులు కేటాయించింది. పిల్లలపై పర్యావరణ సంక్షోభ ప్రభావం అధికంగా ఉన్న దక్షిణాసియా టాప్‌-4 దేశాల్లో భారత్‌ ఒకటని వెల్లడిరచింది. ఈ జాబితాలో దక్షిణాసియా నుంచి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్‌, భారత్‌లు వరుసగా 14, 15, 25, 26 స్థానాల్లో ఉన్నాయి.

అలాగే, వరదలు, వాయు కాలుష్యం వంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య చిన్నారులున్న దేశాల్లో భారత్‌ 33వ స్థానంలో ఉంది. మహిళలు, చిన్నారులపై పర్యావరణ మార్పు ప్రభావం సామాజికంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నదని తెలిపింది. నాలుగు దక్షిణాసియా దేశాలు సహా ‘‘అత్యంత అధిక ప్రమాదం’’గా వర్గీకరించబడిన 33 దేశాల్లో సుమారు 1 బిలియన్‌ మంది పిల్లలు నివసిస్తున్నారు.

రాబోయే సంవత్సరాల్లో 600 మిలియన్లకు పైగా భారతీయులు ‘తీవ్రమైన నీటి కొరత’ను ఎదుర్కొంటారని ఈ నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో ప్రపంచ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధికమైన తర్వాత భారత్‌లోని పట్టణాల్లో ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు గణనీయంగా పెరుగుతాయని తెలిపింది. కాగా, 2020లో అత్యంత వాయు కాలుష్యం కలిగిన ప్రపంచంలోని టాప్‌-30 నగరాల్లో 21 భారత్‌లోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

యూనిసెస్ నివేదికలో భారత్‌ పొరుగుదేశాలైన నేపాల్‌ 51వ స్థానంలో, శ్రీలంక 61, భూటాన్‌ 111వ స్థానంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సగం మంది పిల్లలు నివశిస్తుండగా.. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చాడ్‌, నైజీరియా, గినియా తదితర దేశాల్లో సమస్య తీవ్రంగా ఉందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది.

Related Post