దర్వాజ-న్యూఢిల్లీ
ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో కరోనా విజృంభణ కోనసాగుతోంది. కరోనా దెబ్బతో ప్రజలు పిట్లల్లా రాలిపోతున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు అది సాధించాం.. ఇది సాధించబోతున్నాం.. అనే మాటలతో ఊదరగోడుతూ వచ్చారు. ఇప్పటికీ అదే తీరును కొనసాగిస్తున్న పాలకులు.. ప్రజల ప్రాణాలతో పనిలేదు… తమకు మాత్రం అధికారం.. రాజకీయం ఉంటే చాలు అనే తీరున సిగ్గుమాలిన నేతల్లా నడుచుకుంటున్నారు.
దేశంలో కరోనా విజృంభణ రాబోతోంది మహాప్రభో అంటూ జాతీయం, అంతర్జాతీయ అనేక సంస్థలు, వైద్య నిపుణులు నెత్తినోరు కొట్టుకున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి అంటూ హెచ్చరించారు. అయితే, ఇవేవి పట్టని పాలకులు.. భారత్‌లో కరోనా వ్యాప్తి ఉండదంటూ.. చిత్ర విచిత్రమైన కథనాలను ప్రచారం చేసి.. కరోనా విజృంభణతో తీవ్ర సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక దేశాలకు భారత్ సాయం చేయడానికి సిద్ధంగా ఉంది… ఇక్కడ తాము ఏం పరిస్థితి ఎదురైనా ఎదుర్కొంటాం అంటూ పాలకులు యావత్ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు.
మన నాయకుల ఉండగా మనకు భయమేల అనే తరహాలో కొంత మంది సైతం వారి గాలిమూటల వ్యాఖ్యలను మరింత ప్రచారం చేశారు. దీంతో కరోనా మహమ్మారి లెక్కచేయకుండా రాజకీయ ర్యాలీలు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభలు, ప్రపంచ దేశాలకు టీకా అందిస్తూ అండగా నిలిచాం.. అంటూ మాటల రాజకీయాలు మళ్లీ షురూ చేశారు. ఆ నిర్లక్ష్యపు, నిద్రమత్తు యవ్వారమే నేడు దేశ ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది.
దేశంలో కరోనా విలయతాండవానికి నిదర్శనం తాజాగా నమోవుతున్నకొత్త కేసులు, మరణాలు. గత 24 గంటల్లో భారత్‌లో మూడున్నర లక్షలకు పైగా కొత్తకేసులు, మొదటి సారి ఒకే రోజు మూడువేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపపంచలోని ఏ దేశంలోనూ కరోనా ఉధృతి ఈ స్థాయిలో లేదు. ఇదిలా ఉంటే, ఇప్పటికే పాజిటివ్ కేసులు, మరణాల లెక్కలు తక్కువగా చూపిస్తున్నారంటూ పాలకులపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలకు అనుగుణంగానే స్మశానాల్లో కాలుతున్న కరోనా శవాలకు, ఆస్పత్రుల్లో కిటకిటలాడుతున్న రోగులకు.. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా ఉంటోంది.
కరోనా విజృంభణకు అనేక కారణాలు ఉండవచ్చు కానీ.. రాబోయే కాలంలో దీనిని ఎదుర్కోవడానికి సరైనా యంత్రాంగాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దానికి అనుగుణంగా సహకారం ప్రజలు కూడా అందించాలి. కానీ ముందు రాబోయే పెను ప్రమాదం గురించిన హెచ్చరికలును నిర్లక్ష్యంతో.. మరిచిన సర్కారు.. కరోనా విజృంభణకు మార్గదర్శకాలు పాటించకపోవడం.. మాస్కులు ధరించకపోవడం.. మొత్తంగా కరోనా వ్యాప్తికి ప్రజలే కారకులు అనే ప్రచారాన్ని ముందుకు తెస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. కరోనా నిబంధనలు తీసుకొచ్చారు సరే.. మరి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఏవరిది? ఆ పని ప్రజలే చేస్తే పాలకులుగా మీరేందుకు? అనే ప్రశ్నలు చాలానే వస్తాయి !
సరే.. ఒకవేళ కరోనా వ్యాప్తికి ప్రజలే కారకులు అనుకుందాం ! కరోనా తీసుకురాబోయే సంక్షోభాన్ని నివారించడానికి అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించాల్సిన సంగతేంటి మరి? విషయమేంటంటే.. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుంటే అధికార దాహానికి అలవాటు పడ్డ మన నాయకులకు.. గాల్లో కలుస్తున్న ప్రజల ప్రాణాలు కనిపించలేదు. అందుకే ఎన్నికలు, ప్రచారాల్లో మునిగి.. భారీ సభలు, ర్యాలీలు నిర్వహించి.. దేశంలో కరోనా విజృంభణకు కారకులయ్యారు. కరోనా మార్గదర్శకాలు పాటించి ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన పలువురు నేతలే వాటిని తుంగలోతొక్కారు. కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుంటే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. అధికార దాహా.. రాజకీయ పబ్బంలో మునిగిపోయారు.
దీంతో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ముందే జరగాల్సినదంతా జరిగిపోయింది. కారోనా కాటుకు నిత్యం వేలల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయ్. దేశంలోని కరోనా రోగులు చికిత్స కరువైంది. ఆస్పత్రుల్లో పడకలు లేవ్. ఆక్సిజన్ లేదు. ఆరోగ్య వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంది. ఇప్పుడు ప్రపంచం ముందు ఆరోగ్య సదుపాయల కోసం దేహీ అని అడుక్కొవాల్సిన పరిస్థితిలోనే ఇంకా దేశమున్నదని తెలిసేలా చేసింది. అయినప్పటికీ.. పాలకులలో చైతన్యం వచ్చిందా అంటే.. ఇప్పటికీ అదే తరహా నిర్లక్ష్యం. నిద్ర మత్తు.. పాలకులు ఇదే తరహా ధోరణి కొనసాగిస్తే.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలు తిరగేసి చదువుకోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు.
Share this content: