- కొత్తగా 1,619 మరణాలు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఆందోళనకర స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం దేశంలో వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 మందికి కరోనా సోకింది. దేశంలో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.
అలాగే, గత 24 గంటల వ్యవధిలో వైరస్‌తో పోరాడుతూ 1,619 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,78,769కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరింది. కొత్తగా 1,44,178 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య మొత్తం 1,29,53,821 చేరింది.
ప్రస్తుతం 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఆదివారం వరకు దేశంలో మొత్తం 26,78,94,549 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
