దర్వాజ-న్యూఢిల్లీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఎక్కడ ఏం జరిగినా ఆ సమాచారాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ.. కరోనా కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు సైతం అధికంగానే కరోనా బారినపడుతున్నారు. వీరిలో ప్రాణాలు కోల్పోతున్న వారు సైతం అధికంగానే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా కరోనా కల్లోలం రేపుతున్న భారత్‌లో వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పాత్రికేయుల సంఖ్య అధికమవుతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
తాజాగా జెనీవాకు చెందిన ది ప్రెస్ ఎంబ్లేమ్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో బ్రెజిల్ (181 మరణాలు), పెరూ (140), భారత్ (114)లు టాప్-3లో ఉన్నాయి. భారత్‌లో గత రెండు వారాల్లోనే 45 మంది పాత్రికేయులు కరోనాతో కన్నుమూశారని నివేదిక పేర్కొంది.
భారత్ తర్వాతి స్థానంలో మెక్సికో (106), ఇటలీ (52), బంగ్లాదేశ్ (51), కొలంబియా (49), యుఎస్ఎ (47), ఈక్వెడార్ (46), యునైటెడ్ కింగ్‌డమ్ (28), డొమినికన్ రిపబ్లిక్ (27), పాకిస్థాన్ (25), టర్కీ (24), ఇరాన్ (21), రష్యా (21), అర్జెంటీనా (17), వెనిజులా (17), పనామా (16), స్పెయిన్ (15), ఉక్రెయిన్ ( 14) దేశాలు ఉన్నాయి. మొత్తంగా గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రపంచంలోని 76 దేశాల్లో మొత్తం 1,203 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారు.
భారత్‌లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో అమ్జాద్ బాద్షా (ఒడిశా), తన్మోయ్ చక్రవర్తి (త్రిపుర), వివేక్ బెంద్రే, సచిన్ షిండే, జైరామ్ సావంత్ , సుఖ్‌నందన్ గవై (మహారాష్ట్ర), రామ్ ప్రకాష్ గుప్తా (బీహార్), రోహితాష్ గుప్తా (ఉత్తర ప్రదేశ్), రంజన్ అలీ (ఆంధ్రప్రదేశ్) వంటి జర్నలిస్టుల పేర్లను నివేదిక పేర్కొంది. ఒక్క ఏప్రిల్ 28నే ఆరుగురు భారతీయ జర్నలిస్టులు కరోనాతో మరణించారు. వారిలో అనిల్ బస్నోయి (జైపూర్), శ్రీధర్ ధర్మసనం (హైదరాబాద్), రాజు మిశ్రా (ఘజియాబాద్), ఆకాష్ సక్సేనా (గ్వాలియర్), కొండ్రా శ్రీనివాస్ గౌడ్, సమ్మీ రెడ్డి (మంచిర్యాల్)లు ఉన్నారు. ఏప్రిల్ 27న ముంబయి చెందిన పాత్రికేయులు సదానంద్ షిండే మరణించారు.
సమాజిక సంబంధాలు కొనసాగించే వృత్తిలో కొనసాగడం, అది కూడా కరోనా విజృంభణ ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో తమ వంతు పాత్ర పోషించే క్రమంలో పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కరోనా వల్ల సంభవించిన ఆరోగ్య సంక్షోభం గురించి నివేదించే క్రమంలో అనేక సవాళ్లతో పాటు బెదిరింపులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. కాగా, కరోనా వల్ల సంభవించిన పాత్రికేయుల మరణాల విషయంలో అనేక మీడియా సంస్థలు అధికారుల జోక్యానికి భయపడి వాస్తవ గణాంకాలను సైతం వెల్లడించడం లేదనే విషయాన్ని సైతం ది ప్రెస్ ఎంబ్లేమ్ నివేదిక ప్రస్తావించింది.
Share this content: