Breaking
Tue. Nov 18th, 2025

Sobhan Babu: శోభన్ బాబు మాట వినలేదు… కోట్ల ఆస్తిని కోల్పోయిన జయసుధ !

jayasudha
Photo credit: Facebook / Vinjamuri Venkata Apparao

దర్వాజ – హైదరాబాద్

Jayasudha: టాలీవుడ్‌లో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ తన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్రహీరోలతో నటించి, తన స్థాయిని నిరూపించుకున్న జయసుధ చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టారు. విజయనిర్మల సహకారంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె, తక్కువ సమయంలోనే పెద్ద పేరు సంపాదించారు.

ఒక ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ, తన జీవితంలో ఏకైక దురదృష్టకర నిర్ణయాన్ని గుర్తుచేసుకున్నారు. “చెన్నైలో ఉన్నప్పుడు ఒకరోజు షూటింగ్ తర్వాత శోభన్ బాబు గారు నన్ను కారులో తీసుకెళుతూ ఓ స్థలాన్ని చూపించారు. ‘ఇదే ప్లేస్, వెంటనే కొనుక్కో. నీ నాన్నకి చెప్పు’ అని చాలా రిక్వెస్ట్ చేశారు” అని చెప్పారు జయసుధ.

అయితే, ఆ స్థలం అప్పట్లో పందులు తిరుగుతూ, దుర్వాసనతో ఉన్న డంపింగ్ యార్డ్. “నాకు అప్పట్లో ఇది ఎంత అనర్థమైన సలహా అనిపించింది. అంతటి గొప్ప నటుడు ఇది ఎందుకు అంటున్నాడు అని ఆశ్చర్యపోయాను. కొనాలన్న ఆలోచనే రాలేదు” అని ఆమె తెలిపారు.

డంపింగ్ యార్డ్ నుంచి అన్నా నగర్

కాలం మారింది. ఆ డంపింగ్ యార్డ్ ఇప్పుడు చెన్నైలోని ప్రముఖ ప్రదేశం అయిన అన్నా నగర్‌గా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలుకుతోందని జయసుధ చెప్పారు. “అప్పట్లో ఆయన మాట విన్నుంటే, నా ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉండేది” అని చెప్పారు.

జయసుధ జీవితంలో ఆటుపోటులు ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. భర్త నితిన్ కపూర్ మరణం ఆమె జీవితంలో తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక ఇబ్బందులే భర్తను ఆత్మహత్యకు దారి తీసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. “సినిమాల నిర్మాణం చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు” అని చెప్పిన జయసుధ, ఆ ప్రయత్నాలు తమను ఆర్థికంగా గట్టిగా దెబ్బతీశాయని చెప్పారు.

“సావిత్రి గారు అప్పట్లో మద్యం వ్యసనంతో బాధపడినట్టు మాత్రమే తెలిసింది. కానీ ఆమె ఆస్తులు ఎలా కోల్పోయారో మాకు తెలియదు. అలా నేనూ ఏ తప్పుల్ని గమనించకుండా ముందుకు సాగాను,” అని చెప్పారు జయసుధ.

శోభన్ బాబు విషయంలో ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు, “ఆయన డబ్బు విషయంలో ఎంతో ప్లానింగ్‌తో ఉండేవారు. భవిష్యత్తులో విలువ కలిగే ప్రాపర్టీలను ముందుగానే గుర్తించగలిగేవారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉండేద‌ని అన్నారు.

Related Post