అతడే బడుగు బలహీన వర్గాల ఆశాదీపం.
బ్రాహ్మణాధిపత్యాన్ని నిలువునా చీల్చి..
అందరూ సమానులే అంటూ వెలుగెత్తి చాటి చెప్పిన ధీరుడతను.
కులగజ్జితో విర్రవీగిన వారికి అతడే ఒక సమాధానం.
అగ్రకులాల చేతిలో నలిగిన ఎంతో మందికి విప్లవ మార్గం అతను.
వంటింటిలో నాలుగు గోడలకే పరిమితమైన స్త్రీల అభివృద్దికి తొలి కేంద్ర బిందువతను.
కులవివక్ష, సాంఘీక దోపిడి, మూడనమ్మకాల గోడలను పునాదులతో సహా కూల్చేసిన విప్లవకారుడతను.
కులగజ్జి వదిలేలా..
మనుషులంతా ఒక్కటేనని లోకానికి వెలుగెత్తి చాటిన అపరమేధావతను.
అతనెవరో కాదు.. తన విప్లవ స్ఫూర్తిని ఎంతో మందికి నింపి సంఘ సంస్కర్తలను చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫూలే.. అట్టడుగు వర్గాల్లో మగ్గుతున్న స్త్రీలకు చదువుచెప్పించడం కోసం తొలి పాఠశాలను ఏర్పాటు చేసిన సహృదయుడు జ్యోతిరావు ఫూలే..
మన దేశం ఎందరో మేధావులకు నిలయం. బానిసత్వంతో మగ్గుతున్న ఈ దేశం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. అట్టడుగు వర్గాల కోసం, కులపిచ్చిని రూపుమాపేందుకు, అందరూ సమానులే.. అంటూ అగ్ర కులాలపై పోరాటం చేసిన మేధావులెందరో మన దేశంలో ఉన్నారు.
వారిలో బుద్దుడు, మహావీరుడు, కబీర్ దాస్, జ్యోతిరావు పూలే, మహాత్మాగాంది, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి వారు ముందు వరుసలో ఉంటారు. వీరంతా నాటి సమాజ పురోగతి కోసం ఉద్యమిస్తూనే బ్రతికారు. వీరిలో నిమ్నకులం నుంచి పుట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ధీరుడు జ్యోతిరావు ఫూలే.
పుట్టింది వెనుకబడిన కులంలో అయినా.. దేశానికి దిశ నిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు మన జ్యోతిరావు ఫూలే. ఇంత టెక్నాలజీ, చదువులు వచ్చినా కానీ కులగజ్జితో జాలి, దయ లేకుండా ఈ రోజుల్లో కూడా ప్రాణాలు తీస్తున్న ఘటనలను ఎన్నో చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఒక వర్గం ఇంకో వర్గంపై ఆధిపత్య పోరు చేస్తున్న సమయంలో పరిస్థితులను మనం ఊహించగలమా ?
ఆ సమయంలో కూడా భయం కానీ , బెరుకు గానీ లేకుండా.. నిమ్న జాతికోసం దేనికైన తెగించేందుకు సిద్ధమైన మహోన్నత వ్యక్తి ఫూలే.
ఆ రోజుల్లో నిమ్నకులాలను, బడుగు బలహీన వర్గాలను మనుషులుగా చూసేవారు కాదు. వారిని అడుగడుగున నిలువు దోపిడి చేస్తూ.. అవమానిస్తూ.. సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేవాళ్లు అగ్ర కులాలకు చెందిన కొంత మంది.
అలాంటి అగ్రకులాలకు చెందిన మూర్ఖుల ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు పూనుకున్నాడు మన ఫూలే. కులం పేరుతో పీడించబడుతున్న వారందరికి ఆయన ఓ దేవుడు. ఆ రోజుల్లో ఆచారాలు, సాంప్రదాయాలు, ధర్మం, నీతి సూత్రాలు అంటూ సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం అప్పటి బడా కులాలది. వారితో పోరాటం చేసి.. బడుగు, బల హీన వర్గాల్లో మార్పును తీసుకొచ్చాడు ఫూలే.
ఫూలే బాల్యం
1827 ఏప్రిల్ 11న ఫూలే జన్మించారు. ఆయన తండ్రి గోవింద రావు. ఆయన ఒక పూల వ్యాపారి. చిన్న తనంలోనే ఫూలే తన తల్లిని కోల్పోయాడు. ఫూలే తన ప్రాథమిక విద్యను ఒక మరాఠీ పాఠశాలలో పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు మానేసి తండ్రితో వ్యవసాయ పనులను చేసేవాడు. పొద్దంతా పనులు చేసి.. రాత్రంతా లాంతరు కింద కూర్చొని చదువుకునేవారు.
1841 లో స్కాటిష్ మిషన్ పాఠశాలలో తన స్కూలు విద్యను కంప్లీట్ చేశారు. ఫూలేకు సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో స్నేహం ఏర్పడింది. 13 ఏండ్లప్పుడే ఫూలేకు తొమ్మిదేండ్ల వయసున్న సావిత్రితో పెళ్లి జరిగింది. 1847 లో సెకండరీ విద్య కంప్లీట్ చేశాడు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేయకూడదని ఫూలే నిర్ణయించుకున్నారు. కుటుంబ పోషణ కోసం ఫూలే తన తండ్రిలాగే పూల వ్యాపారాన్ని ప్రారంభించారు.
పోరాటానికి కారణాలు
ఫూలే చిన్నతనం నుంచే విప్లవ లక్షణాలను కలిగి ఉన్నాడు. అయితే సమాజంలో మార్పు కోసం పోరాటం చేయడానికి మాత్రం ఒక గట్టి కారణం ఉంది. ఆ ఒక్క కారణమే అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా చేసింది. వాళ్ల అహంకారాన్ని అణిచేలా ఫూలేను మార్చింది. అది 1848 సంవత్సరం. తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి జరిగిన రోజు. అక్కడ ఫూలేకు గట్టి అవమానం జరిగింది. ఆ రోజు నుంచే ఫూలే కుల వివక్ష, అగ్రవర్ణాల ఆధిపత్యంపై పోరాటం చేయడం షురూ చేసిండు.
చదువే ఏందుకు ?
సమాజంలో కుల వివక్ష, అగ్రవర్ణాల ఆదిపత్య దోరణి, మూఢనమ్మకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలంటే మాత్రం అందరూ చదువునేర్చుకోవాలని తెలుసుకున్నాడు. ముఖ్యంగా నిమ్నవర్గాల ప్రజలు చదువుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తించాడు. అందులో స్త్రీల చదువు మరెంతో ముఖ్యమని అందరికి సూచించాడు.
నిమ్న జాతి బాలికల కోసం స్కూల్
స్త్రీలు చదువుకున్నప్పుడే సామాజిక చైతన్యం జరుగుతుందని తెలిపాడు. దీనికోసం అనుకున్నదే తడవుగా.. పూణేలో మొట్ట మొదటి సారిగా నిమ్న జాతుల బాలికల కోసం స్కూలును ప్రారంభించారు. ఆ పాఠశాలే దేశంలో మొదటిది. కానీ నిమ్న కులాల బాలికలకు ఎవరూ చదువు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో.. ఫూలే 1848 లో తన భార్య సావిత్రి బాయి ఫూలేకి చదువు నేర్పించి ఆమెను టీచర్ గా తీర్చి దిద్దారు.
శూద్ర స్త్రీ అయిన సావిత్రి బాయి మొదటి సారిగా అప్పుడే అడుగు బయట పెట్టడం. అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడం అప్పటి బ్రాహ్మణులకు ఏమాత్రం నచ్చలేదు. దాన్ని ఎంతో అపచారంగా భావించిన బ్రాహ్మణులు ఆమెను ఎన్నో విధాలుగా బాధ పెట్టడం షురూ చేశారు.
ఎంత అవమానించినా.. తల్లిదండ్రులు ఫూలేను ఇంట్లో నుంచి గెంటేసినా.. ఫూలే మాత్రం తన ఆశయాన్ని వదిలి పెట్టలేదు. ఇంటిని వదిలేసి మరీ అణగారిన వర్గాల అభివృద్ది కోసం పాటుపడ్డారు. అడుగడుగునా కష్టాలు ఎదురైనా.. అవమానాల పాలైనా.. వాటినేమాత్రం లెక్క చేయకుండా చదువును.. విప్లవ స్ఫూర్తిని నింపడం మాత్రం మానుకోలేదు.
1851-52 లో మరో రెండు బాలికల స్కూల్లను ఫూలే ప్రారంభించారు. అప్పటికే అందులో చదువుకుంటున్న బాలికల సంఖ్య 275 కు పెరిగింది. అలాగే 1853 లో వితంతు మహిళలకు పుట్టిన అనాథ పిల్లల కోసం సేవాసదనం ప్రారంభించారు. నిమ్నకులాల కోసం నిరంతరం కృషి చేస్తున్న పూలే పై బ్రాహ్మణులు కక్ష్య పెంచుకున్నారు. ఎలాగైనా ఫూలేను అంతమొందించాలని చూసినా.. ఫూలేను ఏ శక్తి ఏమీ చేయలేకపోయింది.
నాటి కాలంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, సతీసహగమనం, వితంతు సమస్యలు సమసిపోయేందుకు ఆయన ఎంతో పోరాటం చేశారు. ఎక్కడ ఏ సమస్య వచ్చిన సమస్యలకు మాత్రం తలొగ్గని వ్యక్తి ఫూలే.
“నేను గొప్ప.. నువ్వు తక్కువ అన్న భేదాలు వద్దు.. సమాజంలో అందరూ సమానులే..” అంటూ వెలుగెత్తి చాటిని వ్యక్తి ఫూలే. అట్టడుగువర్గాల అభివృద్ధే ధ్యేయంగా పోరాటం చేసిన ఫూలే నేటికీ ఎందరికో ఆదర్శం. అందుకే ఆయన విప్లవ స్ఫూర్తిని మహత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ వంటి వారు పునికి పుచ్చుకున్నారు.
మనం ఏం చేయాలి?
నేటి సమాజంలో ఫూలే లాంటి విప్లవ కారులు ఎంతో అవసరం. నేను, నా కుటుంబం బాగుంటే చాలు.. సమాజం ఎటు పోతే నాకేంటి అనుకునే రోజులు ఇవి. కానీ 170 ఏండ్ల కిందట ఫూలే మాత్రం.. నేను అంటే నా సమాజం కూడా అని నమ్మారు. అందునే కులగజ్జిని పోగొట్టాలని , అగ్రవర్ణాలు చేస్తున్న అన్యాయాలను, స్త్రీల సమస్యలను పోగొట్టేందుకు కంకనం కట్టుకున్నారు. అందులో భాగంగానే అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యను నేర్పేందుకు ఎంతో కృషి చేశాడు.
అలాంటి మహానీయున్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలి. ఫూలే అంటే.. యేడాదికి ఒక రోజు గుర్తు చేసుకునే పేరు కాదు. ప్రతి క్షణం సమాజ మార్పునకు కృషి చేసిన వ్యక్తని నేటి తరం అర్థం చేసుకోవాలి.
శివలీల రాజమోని,
జర్నలిస్ట్,
రంగారెడ్డి.
rajamonishivaleela@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
Share this content: