Varanasi Movie Story : సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కలిసి చేస్తున్న కొత్త సినిమా ‘వారణాసి’ ఏ స్థాయిలో ఉండబోతోందో టైటిల్ ఈవెంట్‌తోనే స్పష్టమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ గ్రాండ్ కార్యక్రమంలో టైటిల్ గ్లింప్స్ విడుదల కాగా, అందులో కనిపించిన విజువల్స్ అభిమానుల ఊహాశక్తిని మరింత విస్తరించాయి. టైమ్ ట్రావెల్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్.. అన్నింటినీ కలిపే ప్రపంచస్థాయి కథను రాజమౌళి తెరపైకి తెస్తున్నాడు.
గ్లింప్స్‌లోని లోగో డిజైన్ కూడా కథకు సింబాలిక్‌గా నిలిచింది. V నుండి I వరకు వంగిన లైన్ విల్లు ఆకారంలో ఉండగా, ‘A’ పై నుంచి వచ్చే లైన్ బాణంలా కనిపించింది. ఈ రెండు లైన్లూ రామాయణ సూచనగా భావించవచ్చు. పైగా వారణాసి, అయోధ్య దేవాలయాల జెండాలు గుర్తుకు తెచ్చే ఫ్లాగ్లు కథ మౌళికతను మరింత బలపరుస్తున్నాయి.

రుద్ర రూపంలో మహేష్.. రాముడి కథ
ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. త్రిశూలం చేత పట్టుకుని నందిపై స్వారీ చేసే పవర్‌ఫుల్ అవతారంగా ఆయన కనిపించనున్నట్లు తెలిసింది. రాజమౌళి వెల్లడించిన ప్రకారం, కథ రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో మహేష్ రాముడి రూపంలో కనిపిస్తారన్న విషయాన్ని కూడా దర్శకుడు స్పష్టం చేశారు.
క్లైమాక్స్‌లో ఉండే 30 నిమిషాల భారీ యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. అంతేకాకుండా, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మిశ్రమంగా ఉండే కథలో రుద్ర, రాముడి ద్వంద్వ రూపం ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్లనుంది.

గ్లోబల్ స్కేల్ అడ్వెంచర్: లంక నుండి అంటార్కిటికా వరకు
టైటిల్ ఈవెంట్‌లో చూపించిన ఫుటేజ్ ఒక విషయం స్పష్టంగా తెలిపింది.. ‘వారణాసి’ కేవలం కాశీ నేపథ్య కథ కాదు. మంచుతో కప్పుకున్న అంటార్కిటికా ప్రదేశాలు, ఆఫ్రికా అడవులు, పురాతన శిలాశాసనాలతో ఉన్న గుహలు… ఇలా మహేష్ ప్రపంచం చుట్టూ ప్రయాణించే విజువల్స్ కనిపించాయి. ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ అని ఫ్యాన్స్ వెంటనే గ్రహించారు.
ముఖ్యంగా “త్రేతాయుగం లంకా నగరం.. 7200 BCE” అనే ఫ్రేమ్ వెలుగులోకి రావడంతో, కథ మూలంగా రామాయణ కాలానికి నేరుగా కనెక్ట్ అవుతుందని అర్థమైంది. పురాతన లంకలో జరిగిన సంఘటనలు, ఆధునిక వారణాసి మధ్య ఉన్న రహస్య లింక్ కథను ముందుకు నడిపే ప్రధాన అంశమని భావిస్తున్నారు.

స్టార్ క్యాస్టింగ్.. మందాకినీగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్
ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకినీ’గా కనిపించనుండడం పెద్ద ఆకర్షణ. అటువంటి పాత్రలో ఆమె ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఇప్పటికే చర్చనీయాంశమైంది. విలన్ పాత్ర ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటివరకు వారి లుక్స్‌కు వచ్చిన స్పందన అద్భుతం. ఈ ఇద్దరిది కథలో కీలక పాత్రలు కాగా, మహేష్‌తో వారి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చనుంది.

మహేష్ భావోద్వేగాం
ఈవెంట్‌లో మహేష్ బాబు మాట్లాడిన మాటలు అభిమానుల గుండెలను తాకాయి. ‘‘నా కెరీర్‌లో ఈ స్థాయి సినిమా చేయడం ఒక జీవితకాల అవకాశం’’ అని ఆయన చెప్పారు. ‘‘నాన్న కృష్ణగారు ఎప్పుడూ నన్ను పౌరాణిక పాత్రలో చూడాలని కోరుకున్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతోంది’’ అని భావోద్వేగంగా అన్నారు. సినిమా విడుదలయ్యే సమయంలో దేశం గర్వపడేలా చేస్తానని మహేష్ హామీ ఇచ్చారు.
ఇలా ‘వారణాసి’ పురాతన లంకా నుండి ఆధునిక వారణాసి వరకు సాగిన ఒక యుగాంతర ప్రయాణాన్ని, రుద్ర, రాముడి శక్తివంతమైన కథను తెరపైకి తీసుకురాబోతున్న అద్భుత ప్రాజెక్ట్ అని స్పష్టమవుతోంది.
