Loading Now

మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !

  • మ‌హిళ‌ల‌తో పోలిస్తే 60 శాతం ఎక్కువ మరణాలు
  • లండ‌న్ ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం వెల్లడి

ద‌ర్వాజ-న్యూఢిల్లీ

మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మరణాల ముప్పు అధికంగా ఉంటుందని తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. 50 ఏండ్లు పైబ‌డిన పురుషుల్లో అదే వయసు మహిళలతో పోలిస్తే మరణం ముప్పు అధికంగా ఉంద‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. మ‌రీ ముఖ్యంగా ఇది దాదాపు 60 శాతం ఎక్కువని తెలిపింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం పురుషుల్లో చోటుచేసుకునే ధూమపానం, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య సమస్యలని వెల్లడించింది.
Men-Worldwide-Have-Shorter-Life-Spans-Than-Women-3 మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !

స్త్రీ, పురుష మరణాల్లో వ్యత్యాసం, దానికి గ‌ల కారణాలపై లండ‌న్ సైంటిస్టులు ప‌రిశోధ‌న జరిపారు. ఈ అధ్యయన వివ‌రాలు తాజాగా కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమ‌య్యాయి. ఆ వివ‌రాల ప్ర‌కారం.. 50 సంవ‌త్స‌రాలు నిండిన పురుషులు, మహిళల మరణాల మధ్య తేడాలు చాలా ఉన్న‌ట్టు గుర్తించారు. వివిధ దేశాల్లో స్త్రీ పురుషుల మ‌ర‌ణాల్లో వ్యత్యాసం వేరువేరుగా ఉన్నట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

స్త్రీ, పురుషుల మ‌ర‌ణాల వ్య‌త్యాసం పై లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ యూ-జూ వూ మాట్లాడుతూ.. మ‌ర‌ణాల‌కు సంబంధించి ఇలా తేడాలు ఉండ‌టం ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక, జీవన విధానం వంటి అంశాలు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. ఇందులో వారి ఆహారపు అలవాట్లు, వారి జీవ‌న ప‌రిస్థితులు, సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక స్థితిగ‌తులు వారి ఆరోగ్యం ప్ర‌భావం చూపుతున్నాయ‌ని తెలిపారు.

Men-Worldwide-Have-Shorter-Life-Spans-Than-Women-2 మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !

ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా మొత్తం 28 దేశాల్లోని ప్ర‌జ‌ల‌పై అధ్య‌యనం చేశారు. మొత్తం 1.79 ల‌క్ష‌ల మందిపై జ‌రిపిన ఈ ప‌రిశోధ‌న‌లో 55 శాతం మంది మ‌హిళ‌లు, 45 శాతం మంది పురుషులు ఉన్నార‌ని ఈ అధ్య‌య‌న బృందం పేర్కొంది. ఈ అధ్య‌య‌నంలో భాగంగా ఆయా దేశాల ప్రజ‌ల జీవ‌న విధానం, సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితులు, ఆరోగ్య సంర‌క్ష‌ణ వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఈ డేటాను విశ్లేషించ‌గా.. మ‌హిళ‌ల‌తో పోలిస్తే.. 50 ఏండ్లు పైబ‌డిన పురుషుల‌లో మ‌ర‌ణాల 60 శాతం అధికంగా ఉంటున్నాయి.

Men-Worldwide-Have-Shorter-Life-Spans-Than-Women-1 మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !

ఇలా మ‌ర‌ణాల్లో ప్ర‌భావితం చేసే అంశాలు చాలానే ఉన్న‌ప్ప‌టికీ… అందులో వారి వారి అల‌వాట్లు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ముఖ్యంగా పురుషుల‌లో మ‌ర‌ణాల‌కు కార‌ణం వారి అల‌వాట్లు.. పొగతాగ‌డం (ధూమపానం) మ‌ద్యం సేవించ‌డం వంటి వాటి ద్వారా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌ర‌ణ ముప్పును పెంచుతున్నాయ‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేశారు. దీనిని నివారించ‌డానికి త‌గిన జాగ్ర‌త్త‌లు, జీవ‌న శైలీలో మార్పులు అవ‌స‌ర‌మ‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది.

Share this content:

You May Have Missed