Loading Now
Modi strain BJP Congress Toolkit

మోడీ స్ట్రెయిన్.. కాంగ్రెస్ టూల్‌కిట్ ర‌చ్చేంటి?

  • కాంగ్రెస్-బీజేపీల మధ్య మళ్లీ టూల్‌కిట్ వార్
  • క‌రోనా ఉధృతి వేల‌ హీట్ పుట్టిస్తున్న టూల్‌కిట్ రాజ‌కీయం

దర్వాజ-న్యూఢిల్లీ

భారత్ లో ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు అదే స్థాయిలో రాజకీయ హీటు కూడా పెరుగుతోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు అలసత్వ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కారు తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ – బీజేపీల మధ్య పోలిటికల్ వార్ మరింతగా ముదురుతోంది. తాజాగా కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. దీంతో దిశా కేసుతో విస్తృత ప్ర‌చారంలోకి వ‌చ్చిన టూల్‌కిట్ వ్య‌వ‌హారం మరో అంశంతో తెర‌పైకి వ‌చ్చి ప్ర‌స్తుతం ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. కాంగ్రెస్ – బీజేపీల మ‌ధ్య కేసులు పెట్టుకునే స్థాయికి తీసుకెళ్లింది ఈ టూల్ కిట్ వ్య‌వ‌హారం.

అస‌లు ఎంటీ ఈ కాంగ్రెస్ బీజేపీల మ‌ధ్య టూల్‌కిట్ య‌వ్వారం? ఎందుకు తీవ్ర స్థాయిలో పొటిటికల్ హీట్‌ను పుట్టిస్తోంది?

కోవిడ్-19 సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటోందని గ‌త కొన్ని రోజులుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ మ్యూటెంట్ స్ట్రెయిన్ ను ప్రధాని పేరు మీదుగా ‘మోడీ స్ట్రెయిన్’ అనే పేరుతో టూల్‌కిట్ ను కాంగ్రెస్ సృష్టించింద‌ని బీజేపీ ఆరోపిస్తూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీంతోపాటు, కరోనా వ్యాప్తికి హరిద్వార్‌లో ఇటీవ‌ల నిర్వ‌హించిన కుంభమేళా కారణమంటూ ‘సూపర్ స్పైడర్ కుంభ్’ అని కాంగ్రెస్ కొత్త నినాదం తీసుకొచ్చిందని పేర్కొంటోంది.

భార‌త్‌లో వెలుగుచూసిన నూత‌న క‌రోనా వేరియంట్‌ను మోడీ స్ట్రెయిన్‌గా పిల‌వాల‌ని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ నేతలతో పాటు రాహుల్ గాంధీ సూచిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని పేరును నాశనం చేయడానికి కాంగ్రెస్ టూల్‌కిట్‌ను రూపొందించినట్టు బీజేపీ నేతలు జేపీ నడ్డా, సంబిత్ పాత్ర, కేంద్రమంత్రి మురళీధరన్ సహా పలువురు కమళం నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్లు చేశారు. బీజేపీ నేత‌లు సంభిత్ పాత్ర‌, జేపీ న‌డ్డా వంటి ప‌లువురు నేత‌లు ట్వీట్లు చేశారు. మోడీ పేరు చెడగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కాంగ్రెస్ చెబుతోందని ఆ ట్వీట్లలో బీజేపీ నేతలు ఆరోపించారు.

బీజేపీ వైఫ‌ల్య దృష్టిని మ‌ళ్లించ‌డానికే అంటూ కాంగ్రెస్ ఫైర్

బీజేపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. కమళం నేతల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసింది. త‌మ‌ పార్టీ కార్యకర్తలకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించింది. బీజేపీ.. ఫేక్ టూల్‌కిట్‌ను రూపొందించి ప్ర‌చారం చేస్తోంద‌నీ, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సంబిత్ పాత్ర, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స‌హా ప‌లువురు బీజేపీ నేత‌ల‌పై కేసు పెట్టిన‌ట్టు సీనియర్ నాయకుడు రాజీవ్‌ గౌడ ట్వీట్ చేశారు.

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి దృష్టిని మ‌ళ్లించ‌డానికే న‌కిలీ టూల్‌కిట్ స‌మ‌స్య‌ను లేవ‌నెత్త‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. ప్రస్తుతం ఈ మోడీ స్ట్రెయిన్, కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారం తీవ్ర స్థాయిలో రచ్చ చేస్తోంది. ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.. !

Share this content:

You May Have Missed