- క్రషర్ ఏర్పాటుకు లంచం అడిగిన తహసీల్దార్
- మధ్యవర్తిగా మాజీ వైస్ ఎంపీపీ
- చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
దర్వాజ, రంగారెడ్డి
ఓ తహసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. ఫైసలు తీసుకునేందుకు మధ్యవర్తిని నియమించుకున్నాడు. డబ్బులు తీసుకున్న ఆ మధ్యవర్తి అడ్డంగా దొరికిపోతానని బయపడ్డాడు. దాంతో తీసుకున్నమొత్తాన్ని కాల్చేశాడు. ఈ ఘటన మంగళవారం కల్వకుర్తిలోని విద్యానగర్ లో చోటుచేసుకుంది.
ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలంలోని కోరంతకుంట తండాకు చెందిన రమావత్ రాములు నాయక్ కు వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ శివారులో 15 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో రాములు నాయక్ క్రషర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. అందుకోసం జనవరి 12 ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడు.
అందుకు ఫిబ్రవరి 16 భూమి సర్వేకు హాజరు కావాలని వెల్దండ తహసీల్దార్ ఆఫీస్ నుంచి రాములు నాయక్ కు నోటీసులు అందాయి. ఈ విషయమై తహసీల్దార్ రూ. 6 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. చివరకు రూ.5 లక్షలకు ఇరువురు ఒక మాట మీదకు వచ్చారు.
ఆ రూ. 5 లక్షలను కూడా తహసీల్దార్ డైరెక్ట్ గా కాకుండా వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ కు ఇవ్వాలని సూచించాడు. ఈ విషయంపై రాములు నాయక్ మహబూబ్ నగర్ లోని ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. ఏసీబీ ఆధికారుల సూచన మేరకు రాములు నాయక్ మంగళవారం సాయంత్రం కల్వకుర్తి లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న వెంకటయ్య గౌడ్ ఇంటికి వెళ్లాడు.
ఈ సమయంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వెంకటయ్య ఇంటి తలుపులు కొట్టారు. బయపడిన వెంకటయ్య పోలీసులకు ఫోన్ చేశాడు. వచ్చింది ఏసీబీ అధికారులని తెలియడంతో.. ఎక్కడ దొరికిపోతానోననే భయంలో వెంకటయ్య రూ. 5 లక్షలను కాల్చేసే ప్రయత్నం చేశాడు. అందులో 70 శాతం నోట్లు కాలిపోయాయి.
అలాగే ఇంకో తలుపు నుంచి పారిపోదాం అని ప్రయత్నం చేస్తున్న అతన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ సైదులను అదుపులోనికి తీసుకున్నారు. వీరిద్దరిని బుధవారం హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు.
దర్వాజ.కామ్ లో రిపోర్టర్ గా జాయిన్ కావాలనుకుంటున్నారా ? అయితే వెంటనే మీ బయోడేటా ఫాంను మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడీ: darvaaja@gmail.com లేకపోతే మాకు కాల్ చేయండి. మా నెంబర్:7780448771
Share this content: