• యూపీ, కర్నాటక, మహారాష్ట్రలలో అధికం
• నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడి
దర్వాజ-న్యూఢిల్లీ
NCRB data_cyber crime against children: దేశంలో రోజురోజుకూ సైబర్ నేరాలు అధికమవుతున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. మరీ మఖ్యంగా సైబర్ నేరాల్లో చిన్నారులు బాధితులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2019తో పోల్చితే 2020లో పిల్లలపై సైబర్ నేరాలు రికార్డు స్థాయిలో పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక పేర్కొంది. 400 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైందని తెలిపింది.
ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం.. పిల్లలపై లైంగికదాడులు, వారిపై జరిగే అసభ్యకర చర్యలను చిత్రీకరించే మెటీరియల్‌లను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం అధికమైంది. చిన్నారులపై అధికంగా సైబర్ నేరాలు నివేదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ (170), కర్నాటక (144), మహారాష్ట్ర (137), కేరళ (107), ఒడిశా (71)లు టాప్‌లో ఉన్నాయి. 2020లో చిన్నారులపై సైబర్ నేరాలకు సంబంధించి మొత్తం 842 కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికంగా 738 కేసులు పిల్లలను లైంగికంగా అసభ్యకరమైన చర్యలో చిత్రీకరించే మెటీరియల్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడానికి సంబంధించినవి ఉన్నాయి.
ఇంతకు ముందు ఏడాదితో పోలిస్తే చిన్నారులపై సైబర్ నేరాల కేసులు 2020లో 400 శాతం కంటే అధికంగా పెరిగాయని ఎన్సీఆర్బీ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2019లో చిన్నారులపై సైబర్ నేరాలకు సంబంధించి 164 కేసులు నమోదుకాగా, 2018లో 117, 2017లో 79 కేసులు నమోదయ్యాయి. 2020లో చిన్నారులపై సైబర్ నేరాల కేసులు తక్కువగానే అనిపించినప్పటికీ 2019తో పోలిస్తే గణనీయ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
పిల్లల రక్షణ కోసం సమన్వయ విధానం అవసరం..
క్రై చైల్డ్ రైట్స్ అండ్ యూ సీఈవో పూజ మార్వాహా మాట్లాడుతూ.. విద్య, ఇతర కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ను వినియోగిస్తున్న సమయంలో పిల్లలు బహుళ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ లైంగిక వేధింపులు, లైంగిక అభ్యర్థనలు, సెక్సింగ్, అశ్లీలతకు గురికావడం అధికంగా ఉంటున్నదన్నారు. అయితే, పిల్లలు అన్ని సందర్భాల్లో ఈ విషయాలపట్ల బహిర్గతం కాకపోవడంతో వారిని మానసికంగా దెబ్బతీస్తున్నదని తెలిపారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
![Puja-Marwaha-darvaaja-1024x576 పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు](https://darvaaja.com/wp-content/uploads/2021/11/Puja-Marwaha-darvaaja-1024x576.jpg)
కాగా, యూనిసెఫ్ 2020 వేదిక ప్రకారం కరోనా సమయంలో దక్షిణాసియాలో 13 శాతం మంది పిల్లలు, 25 ఏండ్ల వారు, అంతకంటే తక్కువ వయస్సున్నవారు అంతర్జాలాన్ని యాక్సెస్ చేస్తున్నారు. దిగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 14 శాతం మంది పాఠశాల పిల్లలు ఇండ్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉన్నారు. భారత్‌లో ఎంతమంది చిన్నారులు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారనే దానిపై ఖచ్చితమైన అధికారిక డేటా లేదు. కానీ యూనిసెఫ్ 2020 నివేదిక ప్రకారం దేశంలోని 16 రాష్ట్రాల్లో 37.6 మిలియన్ల మంది చిన్నారులు ఆన్లైన్ తరగదులు, రేడియో కార్యక్రమాలు వంటి రిమోట్ లెర్నింగ్ ప్రొగ్రామ్‌ల ద్వారా విద్యను అభ్యసించారు.
ఈ సమయంలో పిల్లల మానసిక స్థితిపై ప్రభావం పడిందని మార్వాహా అన్నారు. దీనికి ప్రధాన కారణం వారు బలవంతంగా అంతర్జాలాన్ని ఉపయోగించడంమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారిపై సైబర్ నేరాలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. పిల్లల రక్షణ కోసం ఒక సమన్వయ విధానం తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు.