అమ్మగా.. ఆలిగా.. ఉద్యోగినిగా.. సమర్థ అధికారిగా ‘ఆమె’ సేవల గురించి ఏమని చెప్పాలి ? ఎంతని చెప్పాలి. ఆమెకు లాలి పాటలు పాడి నిద్ర పుచ్చడమూ తెలుసు. తప్పు చేసినోడికి ఎదురు నిలిచి పోరాడటమూ తెలుసు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ.. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ.. దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ప్రతీ మహిళకు పేరుపేరునా దర్వాజ.కామ్ ధన్యవాదాలు తెలుపుతోంది.
” యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా “ స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. మన దేశంలో దేవతలైతే పూజింపబడుతున్నారు కానీ.. స్త్రీలు ఎంతవరకు గౌరవింపబడుతున్నారనేది ఆలోచించాల్సిన విషయం. కోడి కూయంగ లేసింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఆమె చేసే పనుల గురించి మాట్లాడుకోవడం చాలా ఈజీగానే ఉంటది. కానీ ఆ పనులు మనం(మగవాళ్లు) చేస్తే.. అందులోని కష్టం తెలిసిసొస్తుంది.

ఒంటి చేత్తో ఏక సమయంలో విభిన్న పనులు చేసే నైపుణ్యం ‘ఆమె’ ఒక్కదానికే సొంతం. అలాంటి ఆవిడపై నేటికి వివక్ష కొనసాగుతునే ఉంది. ఇంట్లో అంట్లను ఆమెనే తోమాలి.. అనే దగ్గర మొదలైన వివక్ష.. ఇలాంటి బట్టలే వేసుకోవాలి. బయట కాలు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. గట్టిన నవ్వొద్దు. ఎక్కువ మాట్లాడొద్దు. పెద్దగా చదువుకోవద్దు అంటూ వివక్షలోకి నెడుతూనే ఉన్నాం..
ఇలాంటి వాటిపై నేడు కొంత మార్పు వచ్చింది అనడంలో సందేహం లేదు. కానీ ఆ కొంత మార్పు సరిపోతుందా అనేదే ఆలోచించాల్సిన విషయం. అలాగే మార్పుకు నాంధి పలుకుతున్న మహిళలకు రక్షణ, సహకారం, గౌరవం అందిచడంలో మనం ఎక్కడ ఉన్నాం ? అనేది కూడా ఆలోచించాలి. కనీస అవసరాలు తీర్చేందుకు కావలసిన వసతులను కూడా వాళ్లకు కల్పిండంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రయివేటు సంస్థలు విఫలం అవుతునే ఉన్నాయి.

వాళ్ల సమస్యలు చెబితే.. మనకు నవ్వు వస్తుంది. కానీ ఆ సమస్య మన అమ్మకు, అక్కకు కూడా ఉంటుందని ఏ ఒక్కరం ఆలోచించలోకపోతున్నాం. పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఒక మహిళ చెబితే.. ఆ సమస్యను నవ్వుకునేందుకు ఉపయోగించుకునే వ్యక్తులు ఈ రోజుల్లో కోకొళ్లలు. అందుకే టాయిలెట్ వచ్చినా కానీ దాన్ని కూడా గట్టిగా చెప్పకుండా ఉండిపోతున్న మహిళలు నేటికీ ఎందరో ఉన్నారు.
ఇక ప్రభుత్వాలు పేరుకు రిజర్వేషన్లు, అభివృద్ధి పేరుతో పథకాలను తీసుకొస్తున్నాయే తప్ప వాటి అమలు సరిగ్గా ఉండటం లేదు. మహిళలు అంటే కేవలం ఇంటి పనికే అని అభిప్రాయ పడే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. సాధారణ జనం గురించి పక్కన పెడితే.. జనాల్లో చైతన్యం తేవాల్సిన నాయకులు, చదువుకున్న విద్యావంతులు కూడా ‘ఆమె’ను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే ఎంత వివక్షను ఆమె ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఆమెకు గౌరవం ఇవ్వడం అంటే మహిళా దినోత్సవం రోజు సెలవు ఇవ్వడం కాదు. ఆమె అభిరుచులను ఏంటో తెలుసుకుని వాటిని ఆమె సాధించేందుకు కావల్సిన కృషిని మనం అందించడం. పనులంటే ఆమె చేసేవి కావు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని నేర్పడం. చదువు చాలు అని చెప్పడం కాదు.. చదువుకుని ఆకాశం అంత ఎత్తు ఎదగమని చెప్పడం. పేరుకు పదవుల్లో పెట్టడం కాదు.. పూర్తి అధికారాన్ని తనకే వదిలివేయడం.
గౌరవించడం అంటే మీ అమ్మ, అక్క, చెల్లితో మర్యాదగా ఉండటం మాత్రమే కాదు.. బయట కనిపించే ప్రతీ మహిళతో మర్యాదగా నడుచుకోవడం కూడా. గౌరవించడం అంటే నీకు నచ్చిన వాటిని బలంగా రుద్దడం కాదు.. ఆమెకు నచ్చినవి చేయనిస్తూ.. అందులో తోడుగా నిలవడం. ఇలా చేసిన రోజే ఆమెకు మన నుంచి గౌరవం లభించినట్లు.
ఇక ప్రభుత్వాల దగ్గరికి వస్తే.. పథకాలు ఇవి తెచ్చాం.. అవి తెచ్చాం అని చెప్పడం కాదు. గ్రౌండ్ లెవల్ లో ఎంత మేలు జరుగుతుంది అని చెక్ చేయాలి. ఫలితం లేకపోతే.. దాన్ని సరి చేయడానికి కృషి చేయాలి. ఇంకా మహిళల పట్ల జరుగుతున్న దాడులపై కఠినంగా వ్యవహరించాలి. హంతకులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. దాడులు, అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రక్షణ విషయంలో నమ్మకాన్ని కలిగించాలి.

వారి ఆరోగ్యం దృష్ట్యా ప్రయివేటు, ప్రభుత్వ ఆఫీసుల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల సంఖ్యను పెంచి వారి అభివృద్ధికి సహకరించాలి. రాజకీయ పరంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగా ఉండేలా వారి సంఖ్యను పెంచాలి. చదువుల్లో, ఆటల్లో, సంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న వారికి ప్రభుత్వాలు తోడుగా నిలవాలి.
ఇక అమ్మాయిల విషయానికి కొస్తే.. మా నాన్న చెప్పిండు, మా అమ్మ చెప్పిందనే మూర్ఖపు ఆలోచనల నుంచి బయట పడాలి. మీ చెల్లికి, మీ కూతురికి స్వేచ్ఛను ఇవ్వాలి. మంచేదో చెడేదో సమాజం నుంచి తెలుసుకునేలా ప్రోత్సహించాలి. మీ కళలను అదిలోనే తుంచేయకుండా దానిసాధన కోసం నిరంతరం పోరాడాలి. ఏదేమైనా పోరాటమే మిమల్ని మీ కాళ్లపై నిలబెడతాయని గుర్తించాలి. ఈ విషయంలో ఈ మధ్య వచ్చిన The Great Indian Kitchen అనే మలయాళ చిత్రం మీకు ఒక అవగాహన కలిగిస్తుంది.

ఇక మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది సక్సెస్ పుల్ వ్యక్తులు వారి అభిప్రాయాలను మన దర్వాజ. కామ్ తో పంచుకున్నారు. ఆ విషయాలు మీ కోసం..
ఆ రోజు త్వరగా రావాలి
“నేటికీ మహిళలపై హత్యాచారాలు, హింస, బానిసత్వం కొనసాగుతునే ఉంది. ఇవి ఏ రోజైతే పూర్తిగా ఈ సమాజం నుంచి పోతాయో ఆ రోజే నిజమైన మహిళా దినోత్సవం”.-విద్యశ్రీనివాస్, లా స్టూడెంట్, హైదరాబాద్.
ప్రభుత్వాలు వీటిని మానుకోవాలి
“ప్రభుత్వాలు పని గంటలు పెంచే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిని మానుకోవాలి. ఇవే కనుక అమలులోకి వస్తే.. ముందుగా ఇబ్బంది పడేది మహిళలే. వీటి వలన పాత కాలంలో లాగే మహిళలు వంటింటికీ పరిమితం అవ్వాల్సి వస్తుంది.” – ఎన్. స్వాతి, జర్నలిస్ట్, హైదరాబాద్.
భయం పోగొట్టాలి
“ఒంటరిగా భయటకు పోవాలంటే వనితలు నేటికీ భయపడుతూనే ఉన్నారు. ఎక్కడ ఏ అఘాయిత్యం జరుగుతుందో, ఎక్కడ ఏ అవమానాన్ని ఎదుర్కోవాలో అనే భయం వెంటాడుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వాలే కాదు, సామాన్య ప్రజలు కూడా పోరాటం చేసి.. వనితలకు బాసటగా నిలవాలి.” -బి. సుమిత్ర, జర్నలిస్టు, మంచిర్యాల్.
నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు
“మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి ఎదో ఒక పని చేసిన రోజే విజయం సాధించారు. దాన్ని ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. తనకు తెలుసు తను ఎంత శక్తి వంతమైన వ్యక్తో. మీరు తనకు ఏది చేతకాదు అని చెప్పేముందు.. తనలాంటి ఒక చేతకాని తల్లి కడుపులోనుంచే నువ్వు వచ్చావనే ముచ్చట మర్చిపోవద్దు.”-ఆర్. శివలీల, జర్నలిస్ట్, రంగారెడ్డి
మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
